జగన్ పాలన చూస్తుంటే తుగ్లక్ ను తలపిస్తోందని మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శల వర్షం కురిపించారు. మేము తలచుకుంటే వైకాపా నేతలు రాష్ట్రంలో తిరిగేవారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో మూడు నెలల తరువాత మంచి స్పందనే కనిపించిందని హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది వందల హామీలు ఇచ్చారు, నవరత్నాలని అమలు చేస్తామన్నారు, ఇవి ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు, జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు అని లోకేశ్ అన్నారు.


గ్రోత్ రేటింగ 5 శాతం తోనే ఆగిపోయిందని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై లోకేష్ వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది ప్రజలకు అర్థమైందని లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం రివర్స్ గేర్ లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. అవంతి తన శాఖను సరిగ్గా చూసుకుంటే చాలు మా గురించి కామెంట్స్ అక్కర్లేదని చురకలు అంటించారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు ఎవ్వరైనా టిడిపికి వచ్చి పనిచేయవచ్చని లోకేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతిలో జగన్ ఏ స్కామ్ బయటపెట్టారని లోకేష్ నిలదీశారు.


సీఎం జగన్ కే రాజధాని అంశంలో క్లారిటీ లేదు మంత్రులూ తలోమాట మాట్లాడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతి కోసం ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా వున్నామని లోకేష్ స్పష్టం చేశారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ, గంటా పార్టీ మారే విషయం తెలియదు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఇసుక మాఫియా గురించి మాట్లాడిన లోకేష్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. తమపై గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మాపై ఇసుక మాఫియాని ఆరోపించారన్నారు.


ఆయన ఇప్పుడు కొత్త పాలసీ ద్వారా వచ్చే సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతుంది అందరికీ తెలిసిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఓటమి గురించి మాట్లాడుతూ ఈ సారి యువతకు చాలా టికెట్ లు ఇచ్చాం కానీ మేమే గెలవలేకపోయాం అన్నారు. పార్టీలు మారడం గురించి మాట్లాడుతూ వ్యక్తిగత స్వార్థం తోనే పార్టీలు మారుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇల్లుతో సహా అన్ని పార్టీ కార్యాలయాలకు అన్ని అనుమతులతోనే నిర్మించామని స్పష్టం చేశారు. కావాలని టిడిపిని వైసిపి టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: