సుదీర్ఘ‌కాలం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలను అందించిన ఈఎస్ఎల్ నరసింహన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆత్మీయ వీడ్కోలు పల‌క‌నున్నారు. ఈ నెల 7వ తేదీన గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించనుంది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. 8వ తేదీన కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న నేప‌థ్యంలో... ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలకనుంది. 


ఇదిలాఉండ‌గా, తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న తమిళిసై.. ప్రస్తుత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌ గా ఆమె రికార్డు సృష్టించనున్నారు. రాష్ర్టానికి నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసైకి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. కొత్త గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ర్టానికి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. సామాన్య కార్యకర్తగా పనిచేసిన తనకు బీజేపీ పెద్ద గుర్తింపునిచ్చిందని తమిళిసై ఆనందం వ్యక్తంచేశారు. తనకు రాజ్యాంగ పరమైన పదవినిచ్చినందుకు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక కృతజతలు తెలిపారు. ఇకపై తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు.7వ తేదీనే గవర్నర్‌ నరసింహన్‌కు ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించనుండ‌గా ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


తమిళిసై సౌందరరాజన్ రాజకీయ ప్రస్థానం మొదటి నుంచీ ఆసక్తికరం. ఆమె స్వతహాగా వైద్యురాలు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా గుర్తింపు పొందారు. విదేశాల్లో మెడికల్ పీజీచేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలోనే ప్రత్యక్ష రాజకీయాల్లో చేరారు. తండ్రి కాంగ్రెస్‌నేత. కానీ, ఆమె మాత్రం బీజేపీనే ఎంచుకున్నారు. క్రియాశీల కార్యకర్తగా చేరి జాతీయ కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: