తీసి క‌ట్టు నామం బొట్లు అన్న‌ట్లు ఉంది ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర శాఖ ప‌రిస్థితి. పార్టీని బ‌లోపేతం చేసుకోవాలంటే ఇత‌ర పార్టీల నేత‌ల‌ను చేర్చుకోవాలి. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను చేర్చుకుంటే వారి పాత వాస‌న‌లు పోక‌పోవ‌డంతో ఇంత‌కు ముందున్న పార్టీ నేత‌ల‌తో ఉన్న సంబంధాలు తెంపుకోవ‌డం లేదు స‌రిక‌దా పార్టీని బ‌జారు కీడుస్తున్నారు. బీజేపీ అంటే అదే సిద్ధాంతం ఉన్న పార్టీ అనుకునేవారు. కానీ రోజులు మారాయి... పార్టీలో నేత‌లు మారారు... అంతా క‌ల‌గూర గంప‌లాగా అయింది బీజేపీ ప‌రిస్థితి. అందుకే ఇప్పుడు బీజేపీ అధిష్టానంకు ఏమి చేయాలో పాలుపోవ‌డం లేదు.


అందుకే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వంకు ఇప్పుడు ఏపీ బీజేపీని గాడిలో పెట్టాలంటే త‌ల‌కు మించిన భారంగా మారింద‌ట‌. అస‌లే కేంద్రంలో ఉన్న ప‌ని ఒత్తిడిలో బీజేపీ నాయ‌క‌త్వం త‌ల‌మున‌క‌లై ఉంద‌ట‌. దీనికి తోడు త్వ‌ర‌లో మ‌హారాష్ట్ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. ఈ త‌రుణంలో ఇప్పుడు ఏపీ బీజేపీలో ముస‌లం పుట్టింది. ఏపీ బీజేపీ రెండు ముక్క‌లైంది. ఇందులో పార్టీలోని పాత‌, కొత్త క‌లిసి కొంద‌రు ఒక వ‌ర్గంగా, టీడీపీ, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన‌వారు ఒక వ‌ర్గంగా బీజేపీ ఇప్పుడు విడిపోయింది.


బీజేపీ ఏపీ శాఖ‌లో ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నేతృత్వంలో ఒక వ‌ర్గం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా స‌మావేశం కాగా, మ‌రో ప‌క్క ఏపీ బీజేపీ కార్యాల‌యంలో బీజేపీ మేధావి వ‌ర్గం, కొందరు పార్టీ ముఖ్య‌నాయ‌కులు స‌మావేశం అయ్యారు. ఇక స‌మావేశంలో ఎవ‌రి వ‌ర్గ ప్ర‌యోజ‌నాలు వారివే అన్న‌ట్లుగా సాగింది వ్య‌వ‌హారం. టీడీపీలో ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు అవినీతి అక్రమాల‌తో ఆరిపోయే ద‌శ‌లో ఉన్న కొంద‌రు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులైన సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌లు త‌మ అవినీతి అక్ర‌మాల‌ను బ‌య‌టికి రాకుండా తమ‌ను తాము కాపాడుకునే ఎజెండాను బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా తో చేయించుకోవాల‌ని ఉబ‌లాట ప‌డుతున్నారు.


ఇంకా కొంద‌రు మాత్రం బీజేపీ బలోపేతం కోసం ప‌నిచేయాల‌ని మ‌రోవైపు ఆరాట ప‌డుతున్నారు. ఇలా బీజేపీ రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఎవరి అభిప్రాయాలు వారే ప్ర‌త్యేక మీడియా స‌మావేశాలు పెట్ట‌డం, వారి ప్ర‌యోజ‌నాల‌నే మీడియా ముందు వెల్ల‌గ‌క్క‌డం, పార్టీ ఆదిష్టానం ప్ర‌మేయం లేకుండానే స్వంత స్టేట్‌మెంట్లు ఇచ్చుకోవ‌డం, ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకోవ‌డం, రెండు వ‌ర్గాలు అన‌వ‌స‌ర‌మైన విష‌యాలు  పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు పోవ‌డమే కాకుండా ఒక వ‌ర్గంపై ఒక వ‌ర్గం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రెండు వ‌ర్గాలు బీజేపీ అధిష్టానంకు ఫిర్యాదులు చేసుకోవ‌డంతో బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు ఒక్క‌సారే షాక్ త‌గిలింది. ఈ రెండు వ‌ర్గాల వ్య‌వ‌హారాన్ని ఇంటలిజెన్స్ వ‌ర్గాల ద్వారా స‌మాచారం తెప్పించుకున్న పార్టీ అగ్ర‌నేత అమిత్ షా కోపం న‌షాలానికి అంటింద‌ట‌.


రెండు వ‌ర్గాల నేత‌ల‌కు ఫోన్లు చేసి క్లాస్ పీకాడ‌ట‌. పార్టీ ప్ర‌యోజ‌నాల క‌న్నా వ్యక్తుల ప్ర‌యోజ‌నాలు ముఖ్యం కాదంటూ, అలా ఎవ‌రైనా వ్య‌వ‌హ‌రిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదంటూ ఖ‌రాకండిగా చెప్పాడ‌ట‌. అంతే కాదు.. ఇక ముందు ఎవ‌రనా పార్టీ లైన్ త‌ప్పితే వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించాడ‌ట‌. అమిత్ షా అగ్ర‌హంతో బీజేపీలోని దొంగ‌ల గుండెల్లో గుబులు మొద‌లైంద‌ట‌. ఇది టీడీపీ, కాంగ్రెస్ కాదు.. అందుకే మా ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు.. అందుకే మూసుకుని ఓ మూల‌కు కూర్చోవాల‌ని జ్ఞానోద‌యం అయింద‌ట‌... సో ఇప్పుడు అమిత్ షా ను చూస్తే బీజేపీలోని  ఏపీ నేత‌ల‌కు వ‌ణుకు పుడుతుంద‌ట‌...


మరింత సమాచారం తెలుసుకోండి: