వారసత్వ రాజకీయాలతో తెరపైకి వచ్చి చివరకు ఎటూ కాకుండా పోతున్న వారసుల్లో విజయవాడకు చెందిన వంగవీటి రాధాకృష్ణ ఒకరు. వంగవీటి రంగా వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే తండ్రి పోయి దాదాపు 30 సంవత్సరాలవుతున్నా ఇంకా ఆయన పేరు చెప్పుకోందే ప్రచారం చేసుకోలేని పరిస్ధితుల్లో రాధా ఉన్నారు.

 

రాధా కేంద్రంగా క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే  ఘనమైన వారసత్వాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నారా అనిపిస్తోంది. ఇదంతా ఎందుకంటే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో రాధా భేటి అయ్యారు. ఈరోజో రేపో జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ కే  తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలీదు.

 

మొన్నటి ఎన్నికల్లో పోటి చేసిన రెండు చోట్లా ఓడిపోవటంతో  పవన్ పైన పెట్టుకున్న కాస్త నమ్మకం కూడా జనాల్లో పోయింది. ఏదో సెలబ్రిటి హోదా ఉంది కాబట్టి అప్పుడప్పుడు జనాల్లోకి రవాటం ద్వారా మీడియా అండతో నెట్టుకొచ్చేస్తున్నారు. అలాంటి జనసేనలోకి రాధా చేరబోతున్నారంటూ మళ్ళీ ప్రచారం మొదలైంది. పవన్ కే దిక్కు లేకపోతే ఇక రాధా పరిస్ధితేంటో అర్ధం చేసుకోవచ్చు.

 

అసలు వైసిపిలో నుండి రావటమే రాధా చేసిన తప్పంటే టిడిపిలో చేరటం మరో తప్పు. తానడిగిన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటును జగన్మోహన్ రెడ్డి కేటాయించలేదన్న కోపంతో టిడిపిలో చేరారు. పోనీ అక్కడేమైనా సీటు ఇచ్చారా అంటే అదీ లేదు. రాధాకు చంద్రబాబు అసలు పోటి చేసే అవకాశమే ఇవ్వలేదు. జగన్ కనీసం సెంట్రల్ కాకపోయినా విజయవాడ తూర్పులో టికెట్ ఇస్తానన్నారు. బుద్దిగా తీసుకునుంటే మొన్నటి ఊపులో రాధా కూడా గెలిచేవారేమో ? మొత్తానికి క్షణికావేశంలో రాధా చేసిన తప్పు మొత్తం రాజకీయ భవిష్యత్తును అంధకారంలో పడేసిందనే చెప్పాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: