సాధారణంగా మొక్కలు వాటి జీవితకాలంలో కొంత ఎత్తు వరకు పెరుగుతాయి. ఆ తరువాత మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. అరుదైన సందర్భాలలో మాత్రమే మొక్కలు సాధారణ ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు పెరుగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి లంక ప్రాంతంలో ఒక బెండ మొక్క ఏపుగా పెరగటంతో స్థానికులను ఆకర్షిస్తోంది. బెండ మొక్క సాధారణ ఎత్తు కంటే రెండు అడుగులు ఎక్కువగా పెరగటంతో యలమంచిలి లంక ప్రజలు ఆ మొక్కను చూడటానికి వస్తున్నారు. 
 
సాధారణంగా బెండ విత్తనాలను నాటితే  మొలిచిన మొక్కలు నాలుగు అడుగుల ఎత్తు నుండి ఐదు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కానీ యలమంచిలిలంకలోని హిందూ పాఠశాల ఆవరణలో కొన్ని రోజుల క్రితం మొలిచిన బెండ మొక్క మాత్రం ఇప్పటికే ఏడు అడుగుల ఎత్తు పెరిగింది. ఇంకా మొక్క ఎత్తు పెరుగుతూనే ఉంది. గత సంవత్సరం ప్రభుత్వం పాఠశాలలకు విత్తనాల పొట్లాలను పంపిణీ చేయటం జరిగింది. 
 
ప్రభుత్వం పంపిణీ చేసిన విత్తనాలను పాఠశాల ఆవరణలో చల్లగా మొలిచిన మొక్కలు సాధారణ ఎత్తు కంటే ఎక్కువగా పెరిగాయని కాయలు కూడా బాగా కాశాయని యలమంచిలి లంక ప్రభుత్వ పాఠశాలకు చెందిన వి.వి.వి. సుబ్బారావు తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులు కూడా బెండ మొక్క అంత ఎత్తు పెరగటంతో ఆశ్చర్యపోతున్నారు. 
 
ఉద్యానవన శాఖ అధికారులు ఈ బెండ మొక్క ఇంత ఎత్తుకు ఎదగటానికి కారణం సారవంతమైన భూమి కావటం మరియు విత్తనం మంచిది కావటం వలనే జరిగిందని చెబుతున్నారు. సాధారణంగా బెండ మొక్క ఐదు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుందని అరుదైన సందర్భాలలో మాత్రమే ఎక్కువ ఎత్తు పెరుగుతుందని ఉద్యానశాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం. బెండ మొక్క ఏడు అడుగుల ఎత్తు పెరగటంతో చుట్టుపక్కల ప్రాంతాలలోని వారు ఆ మొక్కను సందర్శించటానికి వస్తున్నట్లు తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: