ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ..అగ్రదేశాల జాబితాల్లో చేరిపోయింది భారత్.  టెక్నాలజీ పరంగా ఎన్నో వినూత్న ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది.  ముఖ్యంగా అంతరిక్ష రంగంలో భారత్ చేస్తున్న ప్రయోగాలకు అన్ని దేశాలు ఫిదా అవుతున్నాయి. అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనతను సాధించనుంది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరిదైన కీలక ఘట్టాన్ని చేరుకోనుంది.  చంద్రమామ నిగూఢ రహస్యాలను ఛేదించటానికి భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన రెండో ప్రయోగం ఇది.

నాలుగు టన్నుల బరువు ఉన్న ఈ అంతరిక్ష యాత్రలో ఒక లూనార్‌ ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉన్నాయి. ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉంటే... దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితరలం పై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం పని చేస్తుంది ల్యాండర్‌. ల్యాండర్‌ చందమామపై విజయవంతంగా కాలు పెడితే... ఆ తర్వాత దాన్నుంచి విడిపోయి పరిశోధనా కార్యక్రమాన్ని చేపడుతుంది రోవర్‌.  చంద్రయాన్ 2లో చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా శుక్రవారం(సెప్టెంబర్ 7న) అడుగుపెట్టనుంది.

చంద్రుడిపై కాలు మోపే ముందు 15 నిమిషాలే చాలా కీలకంగా మారాయి. అత్యంత వేగంతో తిరుగుతున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్ వేగం ప్రస్తుతం గంటకు 6వేల కిలోమీటర్లు ఉంది.  ఈ రోవర్‌ చంద్రుని ఉపరితలం పై తిరుగుతూ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలు సేకరించి అక్కడే రయానిక విశ్లేషణ చేస్తుంది. దీంతో పాటు ఖనిజాల పరిశీలన, మూలకాల లభ్యతను శోధించటం, నీరు, మంచురూపంలోని నీటి లభ్యతను పరిశీలించటం, చంద్రుని వాతావరణ అధ్యయనం వంటి కార్యక్రమాలు కూడా ఈ రోవర్‌ చేపడుతుంది.

ఈ సమాచాన్ని రోవర్‌ ల్యాండర్‌కు అందజేస్తే... ల్యాండర్‌ ద్వారా భూమి పై ఉన్న ఇస్రో అనుసంధానించే కేంద్రానికి చేరుతుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.40గంటలకు చంద్రుడి కక్ష నుంచి కిందకు దిగే క్రమంలో ప్రధాన దశకు సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ లాండర్‌కు చంద్రుడిపై దిగేందుకు ఆదేశిలిస్తారు. ల్యాండింగ్ సమయంలో చంద్రుడిపై పైకి లేచే ధూళి దుమ్ము నాలుగు గంటల్లో సర్దుకుంటుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి జారుడు బల్ల లాంటి ర్యాంప్ విచ్చుకుంటుంది. దాని మీద నుంచి ఆరు చక్రాల ‘ప్రజ్ఞాన్' రోవర్ కిందకు దిగుతుంది.  14 రోజుల పాటు రోవర్‌ ఈ పరిశోధనా కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు.ఈ లోపు చంద్రుని క్షక్ష్యలో తిరిగే ఆర్బిటర్‌ చంద్రుని ఉపరితల ఫోటోలను తీసి ఇస్రో స్టేషన్‌కు పంపుతూ ఉంటుంది.

 పదేళ్ళ క్రితం 2008 అక్టోబర్‌లో చంద్రయాన్‌ వన్‌ ప్రయోగించారు. గతంలో చంద్రుడిపై ల్యాండ్ కోసం రష్యా, అమెరికా, చైనా ప్రయోగాలు చేశాయి. మన ప్రయోగం విజయవంతంగా చంద్రుడి పై ల్యాండ్‌ అయితే భారత్‌ కూడా ఈ దేశాల సరసన చేరుతుంది. ఇస్రో విజయ పరంపర ఇలానే ముందుకు సాగితే... 2022నాటికి చంద్రుడి పైకి వ్యోమగామిని పంపాలనే ఇస్రో ప్రణాళిక పట్ల అంచనా, ఆకాంక్ష మరింత పెరుగుతాయి. ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగానికి తెలుగు నేల శ్రీహరికోట కేంద్రం కావడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: