చంద్రయాన్ - 2 అంతిమ ఘట్టానికి ఇంకా మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. చంద్రయాన్ - 2 ప్రయోగంలోని చివరి 15 నిమిషాలు తీవ్ర ఉత్కంఠకు కారణమవుతుంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ - 2 ప్రయోగంలో అత్యంత కీలకమైన ల్యాండర్ విక్రమ్ ఈరోజు చంద్రునిపై పాదం మోపనుంది. బారతదేశ చరిత్రలోనే ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయగాథ చంద్రయాన్ - 2 . 
 
ఈ రోజు అర్ధరాత్రి తరువాత ఈ చారిత్రాత్మక ఘట్టం జరగబోతుంది. ఇస్రో శాస్త్రవేత్తల కఠోరశ్రమకు ఈరోజు ఫలితం దక్కనుంది. ప్రపంచ దేశాల చూపు కూడా ప్రస్తుతం విక్రమ్ పైనే ఉంది. చంద్రయాన్ - 2 లోని విక్రమ్ ల్యాండర్ ను గురువారం నాటికి చంద్రునికి 35 కిలోమీటర్లకు దగ్గరగా 101 కిలోమీటర్ల దూరంలో ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆర్బిటర్ చంద్రునికి 96 కిలోమీటర్ల దగ్గరగా 125 కిలో మీటర్ల దూరంలో చంద్ర కక్ష్యలో పరిభ్రమిస్తుంది. 
 
విక్రమ్ ను చంద్రునిపై ల్యాండ్ చేయటం మాత్రం ఇంకా మిగిలి ఉంది. ఈరోజు అర్ధరాత్రి దాటిన తరువాత చంద్రుని దక్షిణ ధృవంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో రెండు చంద్రబిలాల మధ్య ఎగుడుదిగుడు లేని సమతులంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్ కు అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా ద్వారా అన్వేషించనున్నారు. ఒకవేళ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యం కాకపోతే 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో స్థలాన్ని పరిశీలించి సమతులంగా ఉండే ప్రాంతంలో ల్యాండ్ చేస్తారు. 
 
ఆ తరువాత 1.30 గంటల నుండి 2.30 గంటల వరకు విక్రమ్ ల్యాండర్ ను జాబిల్లిపై దించే ప్రయత్నం చేస్తారు. ల్యాండర్ వేగాన్ని 2 మీటర్లకు తగ్గించి చంద్రుని ఉపరితలం చేరేలా చేస్తారు. ల్యాండింగ్ ప్రక్రియ 15 నిమిషాల సమయం పాటు జరుగుతుందని తెలుస్తోంది. చంద్రయాన్ - 2 ప్రయోగంలో 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తు కాగా ల్యాండర్ విక్రమ్ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ కావటం మరో ఎత్తు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: