కడియం శ్రీహరి మాజీ డిప్యూటీ సీఎం. మొన్నటి ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కలేదు. కానీ, ప్రస్తుతం ఈయన ఎంఎల్ సీ. కానీ, పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ పదవుల్లో లేరు. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఆయన వారం రోజులుగా యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో హడావుడి పెంచారు. కార్యకర్తలతో కలిసి కాళేశ్వరం యాత్రలూ చేపట్టారు. అయితే కడియం కాళేశ్వరం యాత్ర వెనుక అసలు కథేంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీఆర్ ఎస్ పార్టీలో పదవులు లేకుండా ఉన్న కీలక నేతలు సీనియర్లు ఏం చేస్తున్నారనే విషయంపై కేసీఆర్ నసర్ పెట్టారనేది ఓ సమాచారం. పార్టీ పరంగా వారి డే టు డే వ్యవహారాల్ని కేసీఆర్ మోనటరింగ్ చేస్తున్నారట.


తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును రైతులు ఇతర వర్గాలకు తీసుకెళ్లి చూపించాలని కేసీఆర్ పార్టీ వర్గాలకు చెప్పారట. ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు వారికి తెలిసేలా చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం. అయితే కొందరు నేతలు ఈ విషయాన్ని పట్టించుకోలేదట. దాంతో కేసీఆర్ కరుణ కోసం చాలా కాలంగా వెయిటింగ్ చేస్తున్న కడియం, కాళేశ్వరం యాత్ర చేపట్టారనేది గులాబీ దళంలో వినిపిస్తున్న గుసగుస. కేసీఆర్ దృష్టిలో పడేందుకు కాళేశ్వరాన్ని మించిన ఐడియా లేదని కార్యకర్తలతో కలిసి యాత్ర చేపట్టారని తెలుస్తోంది.


పనిలో పనిగా బిజెపి కాంగ్రెస్ లపై కడియం నిప్పులు చెరిగారు. దేశ వ్యాప్తంగా అవినీతి అక్రమాలను పెంచి పోషించి, అవినీతి అక్రమాలపై హక్కును పొందిన కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలను విమర్శించే స్థాయిలో లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణలో ముగిసిందని చెప్పడంతో తనకెలాంటి సందేహం లేదు అని కడియం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గానీ, భారతీయ జనతా పార్టీ గానీ కేసీఆర్ ను ఎదుర్కునే పరిస్థితుల్లో లేరు. ఆ స్థాయి గానీ ఆ సత్తా గానీ వాళ్లకు లేదు అని తెలియచేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏకైక బాహుబలి అని కేసీఆర్ గారు మాత్రమే అని అన్నారు




మరోవైపు పదవుల కోసమే కడియం కాళేశ్వరం యాత్ర చేపట్టారని ప్రచారం జరుగుతోంది. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య తో కడియం కు గ్యాప్ ఉంది. కానీ రాజయ్యకు సమాచారం ఇచ్చిన తర్వాతే కడియం కాళేశ్వరం యాత్ర చేపట్టారని సమాచారం. రాజయ్యకు తాను పోటీ కాదని ఇండైరెక్టు గా సంకేతాలిచ్చారట. అంతేకాదు రాజ్య సభ సీటు లేదా మండలి చైర్మన్ పదవి కోసమే కడియం ఈ ప్రయత్నాలు చేస్తున్నారనేది కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాట. కేసీఆర్ దృష్టిలో పడితే ఏదో ఒక పదవి రాకపోతుందా అని కడియం ఆలోచిస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. మొత్తానికి పదవి కోసం ఓ రాజకీయ నేత పడే పాట్లు కడియం ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: