ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ఈరోజు పర్యటించారు. పలాసలో 200 పడకలతో నిర్మించబోయే కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు రీసెర్చ్ హాస్పిటల్ కు జగన్ శంకుస్థాపన చేసారు. నాణ్యమైన రేషన్ బియ్యాన్ని ఇంటింటికీ సరఫరా చేయటం కొరకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ప్రస్తుతం స్టేజ్ 5 లో ఉన్న డయాలసిస్ పేషంట్లకు 10 వేల రుపాయల పెన్షన్, స్టేజ్ 3 లో ఉన్న డయాలసిస్ పేషంట్లకు 5 వేల రుపాయల పెన్షన్ అందిస్తామని చెప్పారు. 
 
మేనిఫెస్టోలోని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న హాస్పిటల్ లో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని జగన్ చెప్పారు. ఉధ్ధానం ప్రాంతంలో తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టానని జగన్ అన్నారు. కిడ్నీ బాధితుల కోసం నాణ్యమైన మందులను అందుబాటులోకి తెస్తున్నామని జగన్ తెలిపారు. తిత్లీ బాధితులకు పరిహారాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. 
 
కొబ్బరి చెట్టుకు 1500 రుపాయల నుండి 3000 రుపాయలకు, హెక్టారు జీడి తోటకు 30 వేల రుపాయల నుండి 50 వేల రుపాయలకు పెంచుతున్నట్లు జగన్ ప్రకటించారు. మత్స్యకార సోదరుల కోసం ఫిషింగ్ జెట్టీ పెడుతున్నామని అక్కడే అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని జగన్ అన్నారు. మత్స్యకార దినోత్సవం రోజున బోట్లు, పడవలు ఉన్న మత్స్యకారులకు 10,000 రుపాయలు ఇవ్వబోతున్నామని జగన్ తెలిపారు. 
 
జగన్ మాట్లాడుతూ ఈ నెల చివరికల్లా సొంతంగా ట్యాక్సీ, ఆటో నడుపుకునే వారికి 10,000 రుపాయలు ఇస్తామని, అక్టోబర్ 15 వ తేదీన రైతు భరోసా పథకం కింద 12,500 రుపాయలు రైతులకు ఇస్తామని, డిసెంబర్ 21 వ తేదీన చేనేత కుటుంబాలకు ఇంటి దగ్గరే 24 వేల రుపాయలు ఇస్తామని తెలిపారు. 2020 జనవరి 26న అమ్మఒడి పథకాన్ని, ఫిబ్రవరి చివరి వారంలో రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులకు 10,000 రుపాయలు ఇస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం కేటాయించేలా చట్టం తెచ్చామని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: