జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లేందుకు తెలుగుదేశంపార్టీ చేస్తున్న ప్రతీ ప్రయత్నమూ బెడిసికొడుతోంది. తాజాగా ముగ్గురు పెయిడ్ ఆర్టిస్టులు పోలీసులకు దొరికిపోయారు. తిరుమలలో చర్చిల నిర్మాణం జరుగుతోందంటూ కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఎప్పుడైతే తిరుమలలో చర్చిల నిర్మాణం అనగానే భక్తుల్లో అలజడి మొదలైంది. ప్రతిరోజు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వెళ్ళే వేలాది మంది భక్తులు చర్చి నిర్మాణం ఎక్కడ జరుగుతోందనే విషయంలో ఆరాలు తీస్తున్నారు. ఎవరెంత ఆరాలు తీసినా చర్చి నిర్మాణం ఆనవాలే కనబడటం లేదు. మొత్తానికి చర్చి నిర్మాణమన్నది ఉత్త పుకారే అని ఊపిరిపీల్చుకుంటున్నారు.

 

సరే ఎంతమంది భక్తులు తిరుమలకు వెళతారు ? ఎంతమంది ఆరాతీస్తారు ? దాంతో తిరుమలలో చర్చి నిర్మాణమనే ప్రచారం జరిగిపోతునే ఉంది. చివరకు టిటిడి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రచారం జరుగుతున్న సోషల్ మీడియాపై కన్నేసిన పోలీసులు ప్రచారానికి కారణమైన ముగ్గురుని గుర్తించారు.

 

వారి అడ్రసులను సంపాదించిన పోలీసులు మొత్తానికి వాళ్ళు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచిరించినపుడు తాము టిడిపి చెప్పినట్లే చేస్తున్నామని అంగీకరించినట్లు జగన్ మీడియా  ప్రకటిచింది. వీళ్ళ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి మరింత లోతుగా విచారణ చేస్తున్నారనుకోండి అది వేరే సంగతి.

 

గతంలో వరదలు వచ్చినపుడు రైతుల వేషంలో పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి ప్రభుత్వాన్ని టిడిపి  అమ్మనాబూతులు తిట్టించిన విషయం తెలిసిందే.  ఆ విషయం బయటపడేటప్పటికి పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం విషయంలో చంద్రబాబు, చినబాబుతో సహా ఎవరూ నోరిప్పలేదు.

 

ఇదే కాదు చాలా విషయాల్లో జగన్ ప్రభుత్వంపై బురద చల్లటానికి టిడిపి చాలా ప్రయత్నాలే చేస్తోంది. తాము జగన్ పై చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు జనాల నుండి పెద్దగా స్పందన రాకపోవటంతో ఏదో ఓ విధంగా బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉంది. సరే ఏ రకంగా ప్రయత్నించినా అదంతా టిడిపికే రివర్సు తగులుతోంది లేండి.


మరింత సమాచారం తెలుసుకోండి: