ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా నవరత్నాలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నవరత్నాలని జగన్ అధికారంలోకి రాగానే అమలు చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నవరత్నాల్లో భాగంగా ఉన్న మద్యపాన నిషేదాన్ని కూడా దశలవారీగా అమలపరిచేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమలుకు నిర్ణయించి విధివిధానాలు ఖరారు కూడా చేసింది.


అయితే దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ఏటా 20శాతం షాపులను తగ్గించేందుకు నిర్ణయించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులు ఉండగా 3,500 మద్యం షాపులను ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ద్వారా నిర్వహించనుంది.  తొలి విడతగా 500 వందల మద్యం షాపులను సెప్టెంబర్ నుంచే ప్రారంభించింది. రెండో విడత మరో 3,000 షాపులను అక్టోబర్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇక జిల్లాల వారీగా కేటాయించిన మద్యం దుకాణాలకు అద్దె ప్రాతిపదికన షాపులు తీసుకునే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. అటు షాపుల్లో పని చేసే సిబ్బంది నియామకం కూడా చేపడుతున్నారు.


ఇక మద్యం షాపులన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవనుండటంతో ఏళ్ల తరబడి ఏపీలో మద్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహకులు మినహా వైన్ షాప్స్ నిర్వహించే వారు తెలంగాణలో వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో సరిహద్దుల్లో ఉన్న జిల్లా వ్యాపారులు తెలంగాణ వైపు వెళుతున్నారు. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు తెలంగాణలో మద్యం వ్యాపారం చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు.


కర్నూలు వ్యాపారులు తమకు సరిహద్దు జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణాజిల్లా వ్యాపారులు నల్గొండ, కృష్ణా, ఉభయ గోదావరిజిల్లాలకు చెందిన సరిహద్దు వ్యాపారులు ఖమ్మం జిల్లాలో వ్యాపారం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఈ జిల్లాల వ్యాపారులు ఇతర జిల్లాల్లోని తమ సిండికేట్ సభ్యులను కూడా భాగస్వాములను చేసే అవకాశాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: