తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కోత పడనుందా ?  ఓట్ ఆన్ అకౌంట్ లో చేసిన కేటాయింపులు తగ్గనున్నాయా ?  అంటే ఆర్థిక శాఖ నుంచి అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి సారి గతంతో పోలిస్తే తక్కువ బడ్జెట్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది.  


ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం లక్షా 82 వేల కోట్ల రూపాయలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ గడువు ఈ నెలలో ముగియనుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ని సోమవారం ప్రభుత్వం అసెంబ్లీ లో పెట్టనుంది. అయితే రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుంది అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర బడ్జెట్ పై పడనుంది. ఇప్పటికే సీఎం ఆ దిశగా సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో బడ్జెట్ లో కోతలు తప్పవని స్పష్టమవుతోంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే 10 శాతం వరకు పూర్తి స్థాయి బడ్జెట్ లో కేటాయింపు లు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. లక్షా 65 వేలకు అటు ఇటుగా బడ్జెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్ తో పోలిస్తే 18 వేల కోట్ల వరకు బడ్జెట్ తగ్గనుంది. 


ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 5 నెలలు పూర్తి కావడంతో ఇప్పటి వరకు అయిన ఖర్చులు, వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలు చేశాయి. ఆర్థిక పరిస్థితిని బట్టి తప్పని సరిగా పెట్టాల్సిన ఖర్చులకు మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు ఉండనున్నాయి. సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెద్దగా తగ్గకున్నా... అభివృద్ధి కార్యక్రమాలకు కోత పడే అవకాశం ఉంది. బడ్జెట్ సైజ్ తగ్గితే ఎస్సీ, ఎస్టీ ప్రగతి నిధి కేటాయింపులు కూడా తగ్గుతాయి. ఓట్ ఆన్ అకౌంట్ లో నిరుద్యోగ భృతికి 18 వందల కోట్లను  కేటాయించారు. అయితే దీనికి ఈ బడ్జెట్ లో తగ్గొచ్చు. రుణ మాఫీకి 6 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ కు వేయి కోట్లు కేటాయించినా వాటిని ఖర్చు చేయలేదు. వ్యవసాయం, ఇరిగేషన్ కి కొద్ది మేర తగ్గే అవకాశాలున్నాయి. 


కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో రాష్ట్ర వాటా ఓ వేయి కోట్లకు కోత పడే అవకాశం ఉంది. జీఎస్టీ ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంది. కేంద్ర పథకాలకు వచ్చే నిధులు కూడా తగ్గనున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయం కూడా తగ్గనుంది. ప్రతి ఏడాది బడ్జెట్ ని పెంచుకుంటూ పోతున్న తెలంగాణ ప్రభుత్వానికి  ఈ సారి ఆర్థిక మాంద్యం బ్రేక్ వేసింది. బడ్జెట్ సైజ్ ని తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: