కేవలం వంద రోజుల్లోనే వందకు పైగా కీలక నిర్ణయాలు తీసుకుని ‘ఇది అందరి ప్రభుత్వం’ అని యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు. శుక్రవారం వెలగపూడి సెక్రటేరియట్ లోని ప్రచార విభాగంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. గత పాలకుల తీరుకు భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలన ఉందన్నారు. ఐదు కోట్ల ప్రజలకు కళ్లకు కట్టినట్లు పరిపాలన దక్షతను తమ ప్రభుత్వం చూపించారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా, రైతు పక్షాపాతిగా ఉంటూ తొలి రోజు నుంచే రైతుల క్షేమం కోసం అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ఇందుకు నిదర్శనంగానే అమలు చేసిన పలు పథకాలు, చట్టాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. సాక్షాత్తు బడ్జెట్ లోనే వ్యవసాయం అనుబంధ రంగాలపై 12.36 శాతం నిధులను కేటాయించడమే ఇందుకొక ఉదాహరణని మంత్రి తెలిపారు. 





వ్యవసాయశాఖ మంత్రిగా రైతులకు ప్రభుత్వం చేసిన కొన్ని పథకాలను మీడియా, ప్రజలతో పంచుకుంటున్నానని ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తొలుత పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, తాను కూడా మీలో ఒకడిగా ఉండటం సంతోషకరమన్నారు. వందరోజులు ప్రభుత్వంలో వ్యవసాయశాఖలో తెచ్చిన మార్పులు ఆహ్వానించదగ్గవే కాకుండా ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు, వ్యవసాయం సంక్షోభంలో ఉందన్న విషయం గుర్తు చేస్తూనే  తమ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండే రైతులకు పదుల సంఖ్యలో పథకాలు అమలు చేసుకుంటూ వారికి భరోసానిచ్చామన్నారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి వైఎస్ ఆర్ రైతుభరోసా అమలు చేస్తామని హమీ ఇచ్చారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పథకమైన కిసాన్ సమ్మాన్ యోజనతో రైతు భరోసా పథకాన్ని అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలోని 70 లక్షల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరే అవకాశం ఉందన్నారు.




 

రాష్ట్రంలో 48  లక్షల 70 వేల రైతు కుటుంబాలు, 38 లక్షల కౌలు రైతులు ఉన్నారని గుర్తు చేశారు. పదకొండు నెలలపాటు భూ యాజమాన్య హక్కులు దెబ్బతినకుండా కౌలు రైతులు హక్కులను కాపాడుతున్నామన్నారు.  ఇప్పటికే వైఎస్ఆర్ వడ్డీలేని పంట బుణాన్ని ప్రకటించామన్నారు. బీమాను రైతులు పక్షాన ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. బుణాలు తీసుకోని రైతులు కూడా ఇందులో ఉంటారన్నారు.  ఉద్యానవన పంటలను కూడా ఇన్సురెన్స్ పరిధిలోకి తెచ్చేందుకు గాను సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 
ప్రమాదవశాత్తూ చనిపోయినా లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైయస్‌ఆర్‌ బీమా ద్వారా రూ. 7 లక్షల నష్టపరిహారం చెల్లిస్తున్నామని మంత్రి కురసాల కన్నబాబు  తెలిపారు. కలెక్టర్, స్ధానిక ఎమ్మెల్యే స్వయంగా ఆ రైతు ఇంటికివెళ్ళి ఓదార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రకృతి విపత్తు నిధికి ముఖ్యమంత్రి 2000 కోట్లు కేటాయించిన విషయం  ఈ సందర్భంగా గుర్తు చేశారు.






మరో 3 వేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం ద్వారా చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని సాహసం ముఖ్యమంత్రి చేశారని కొనియాడారు.  శనగ రైతులకు క్వింటాకు 1500 రూపాయల చొప్పున  ప్రతి ఎకరాకు 6 క్వింటాళ్లకు ఇవ్వడం జరుగుతోందన్నారు.  ఆయిల్ పామ్ రైతులకు మనకు తెలంగాణాకు సాంకేతికమైన సమస్యల వల్ల తేడా వస్తుందని అధికారులు చెపితే ముఖ్యమంత్రి మాత్రం తెలంగాణలో ఇచ్చే రేటునే ఇవ్వాలని వెల్లడించారు. కొబ్బరితోటలకు ఉపాధి హమీ పథకాన్ని అనుసంధానం చేసి పెద్ద ఎత్తున తోడ్పాటు  అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజవర్గానికొక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. ఇందుకు గానూ రూ.119 కోట్ల రూపాయలను కేటాయించామని వీటిని వచ్చే ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: