వరుసగా రెండోసారి బీజేపీని సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ.. నరేంద్ర బాహుబలిగా అవతరించారు. మొదటి విడత పాలనతో పోలిస్తే.. రెండో విడతలో దూకుడైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారీ ప్రజామోదంతో మోడీ సర్కారులో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు, యూఏపీఏ బిల్లుకు సవరణ, ఆర్టికల్ 370 రద్దు లాంటి కీలక నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యతను పెంచేలా.. మోడీ పర్యటనలు ఉంటున్నాయి. 


నరేంద్ర మోడీ అధ్వర్యంలో... రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం... నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి నుంచీ కొన్ని రోజులపాటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్రలో మళ్లీ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నట్టు  తెలిసింది. ఆ రాష్ట్రానికి కొన్ని కీలక ప్రాజెక్టుల్ని ప్రకటిస్తారని సమాచారం. వాటన్నింటినీ... ఎన్నికలకు ముందే... ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించేలా ప్లాన్స్ ఉండబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీం చెప్పుకోతగింది. దీని ద్వారా... వంట గ్యాస్ లేనివారికి కేంద్రం గ్యాస్ సిలిండర్, LPG కనెక్షన్ ఉచితంగా ఇస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 8 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే... 6 నెలల ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సందర్భంగా.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో మోడీ వంటగ్యాస్ సిలిండర్లను అందించనున్నారు.  


2014తో పోల్చితే... 2019లో మోడీ సర్కారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు మరింత గుర్తింపు వస్తోంది. సంస్కరణల విషయంలోనూ మోడీ సర్కార్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకెళ్లింది. ప్రధానంగా... లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకోవడంతో... కేంద్రంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓ రేంజ్‌లో పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్ స్థాయిని పెంచేందుకు 9 దేశాల్లో తిరిగిన మోదీ... వెళ్లిన ప్రతిచోటా... భారత ఖ్యాతిని మరింత పెంచారు. ఆర్థిక, రక్షణ రంగాల్లో సంబధాల్ని మెరుగుపరిచారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటికీ... ఈ విషయంలో పాకిస్థాన్ కుట్రలు సాగనివ్వకుండా... అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కి మద్దతు కూడగట్టటంలో కేంద్రం విజయం సాధించినట్టైంది. 


ప్రధానంగా మోదీ... ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా ఈ 100 రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో ఆయన ఏమాత్రం వెనకడుకు వేయలేదు.  జమ్మూకాశ్మీర్ అంశంతోపాటూ... ముస్లిం మహిళలకు సంబంధించి త్రిపుల్ తలాక్ బిల్లును తెచ్చారు. న్యాయపరమైన అంశాల్లో మరింత పారదర్శకత తెస్తూ... హైప్రొఫైల్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం అయ్యేలా, అవినీతిని కట్టడి చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే 2025 నాటికి 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సంప్రదాయ, ఆధునిక వైద్య వ్యవస్థను ఏకీకృతం చేస్తూ... ఆయుష్ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. అదే సమయంలో... రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేశారు.


అంతర్జాతీయ వేదికలపై భారత్ ను కీలక దేశంగా మార్చడంలో మోడీ కృషి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పారిస్ లో జరిగిన వాతావరణ సదస్సులో భారత్ సూచనలకు మన్నన దక్కినా.. అమెరికా తప్పుకోవడంతో అది విజయవంతం కాలేదు. అయితే అమెరికా అధ్యక్షుడి ముందే.. కశ్మీర్ సమస్య ద్వైపాక్షికమని చెప్పడం ద్వారా.. మోడీ ట్రంప్ కు చురకలు అంటించిన తీరు దేశ ప్రజల్ని ఆకట్టుకుంది. దేశ చరిత్రలోనే మొదటిసారి అభివృద్ధి చెందిన దేశమైన రష్యాకు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడం, తూర్పు రష్యా ప్రాంతంలో భారతీయ పారిశ్రామికవేత్తలు సంపద సృష్టిస్తారని కూడా పుతిన్ కు మాటిచ్చారు ప్రధాని. ఇప్పటిదాకా రష్యా వెళ్లిన ప్రతి భారత్ ప్రధాని.. ఆ దేశం నుంచి సాయం అడిగారే కానీ.. మోడీ లాగా ఎవ్వరూ హామీలివ్వలేదనే వాదన వినిపిస్తోంది. ఇది తప్పకుండా భారత్, రష్యా మైత్రిలో కొత్తశకంగా చెప్పుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. 


మొదటి విడతలో ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం, బ్యాంకుల నిరర్థక ఆస్తుల్ని తగ్గించడానికి కృషి చేసిన మోడీ.. అనుకున్నంతగా సఫలం కాలేదనే చెప్పాలి. నిరుద్యోగ రేటు దశాబ్దాల గరిష్ఠానికి చేరడం, జీడీపీ 5 శాతానికి పరిమితం కావడం, బ్యాంకుల విలీనం ఫలితం ఇవ్వలేదన్న విమర్శలు అలాగే ఉన్నాయి. దేశంలో ఆర్థిక మాంద్యం నడుస్తోందని, దీనికి నోట్లరద్దు, జీఎస్టీ లాంటి మోడీనమిక్సే కారణమనే వాదనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మోడీ సర్కారుకి..  ఆర్థిక మాంద్యం సవాళ్లు విసురుతోంది. బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలేవీ మాంద్యం కోరల నుంచీ దేశాన్ని కాపాడలేకపోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న ఉద్దీపన నిర్ణయాలు కూడా కలిసిరావట్లేదనే వాదన వినిపిస్తోంది. ఈ గండం నుంచీ కేంద్రం ఎంతవరకూ దేశాన్ని గట్టెక్కిస్తుందనేది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: