ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి నాణ్యమైన బియ్యం పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.


పాదయాత్రలో భాగంగా ఉద్దానం కిడ్నీ సమస్యలపై ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి విషయం గుర్తు పెట్టుకున్నానని సీఎం జగన్ చెప్పారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కిడ్నీ బాధితులకు 10 వేలు పింఛన్‌ ఇస్తూ మొదటి సంతకం చేశానని గుర్తుచేశారు. కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ తీసుకొస్తానని పాదయాత్ర సమయంలోనే ఇచ్చిన హామీలో భాగంగానే శంకుస్థాపన చేశానని చెప్పారు జగన్. డయాలసిస్‌ స్టేజ్‌కు వచ్చే ముందు స్టేజ్‌-3 బాధితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద 5 వేలు పింఛన్‌ ఇస్తున్నామని తెలిపారు. 


పలాస, ఇచ్ఛాపురం నియోజవర్గంలోని ప్రతిఒక్కరికీ నేరుగా ఇంటికే శుభ్రమైన తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. మత్య్సకారుల కోసం మంచినీళ్లపేట వద్ద జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ఫిషింగ్‌ జెట్టీతోపాటు అన్నిరకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేపలను నిల్వ చేసుకునేందుకు శీతల గోదాములు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే 4 లక్షల మంది ఉద్యోగాలిచ్చి కొత్త చరిత్ర సృష్టించామని చెప్పారు జగన్. ఇంజినీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామాని ప్రకటించారు. వారికి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఛార్జీల కింద 20 వేలు ఇస్తామన్నారు జగన్. యుద్ధ ప్రాతిపదికన మహేంద్ర తనయ ప్రాజెక్టు పనులు చేపడుతున్నామన్నారు జగన్. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మరచిపోకుండా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: