జింబాబ్వేలో మూడు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముగాబే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జింబాబ్వే స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లిన ముగాబే.. సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా సేవలందించారు. ఆఫ్రికాలో పవర్ ఫుల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. 


జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జింబాబ్వేకి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలితరం నాయకుల్లో ముగాబే ఒకరు. ఆఫ్రికాలో శక్తివంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. మూడు దశాబ్దాలపాటు జింబాబ్వేను పరిపాలించిన ముగాబేను 2017లో సైనిక చర్య ద్వారా అధ్యక్ష పదవి నుంచి దించేశారు.


1924న ఫిబ్రవరి 21న నాటి రొడేసియాలో ముగాబే జన్మించారు. 1964లో రొడేసియా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గానూ ఎలాంటి విచారణ లేకుండా ఆయనను దశాబ్ద కాలానికి పైగా జైల్లో నిర్బంధించారు. 1973లో ఆయన జైల్లో ఉండగానే జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ కి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జింబాబ్వేకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన.. 1980లో్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1987లో ప్రభుత్వాన్ని రద్దు చేసి.. అధ్యక్షుడిగా పీఠమెక్కారు. 2017 నవంబరులో జరిగిన సైనిక తిరుగుబాటు వల్ల ముగాబే పదవి నుంచి వైదొలిగారు. ముగాబే గద్దె దిగాక.. జింబాబ్వేకు అంతర్జాతీయ వేదికలపై ప్రాధాన్యం పోయిందనేది ఆయన అనుచరులు చెప్పే మాట. ముగాబే సుదీర్ఘకాలం జింబాబ్వేకు గుర్తింపుగా ఉన్నారని, ఇప్పుడు ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరనే వాదన వినిపిస్తోంది. ముగాబే అభిమానులు ఆయన ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: