ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ల్యాండర్ మరో నిమిషంలో ల్యాండ్ కాబోతుంది అనగా..అక్కడి వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడంతో.. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి.  ల్యాండర్ సురక్షితంగా ఉన్నదా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.  ల్యాండర్ సురక్షితంగా ఉన్నది అని తెలిస్తే తిరిగి దాన్ని ల్యాండ్ చేయడానికి మార్గం సుగమం అవుతుంది.  


ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు ప్రధాని మోడీ అర్ధరాత్రి నుంచి బెంగుళూరులోని ఇస్రో స్పేస్ సెంటర్ లోనే ఉన్నారు.  ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారు.  అయితే, చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా విక్రమ్ కు సంబంధించిన సిగ్నల్ రాలేదు.  ఆ సమయంలో శాస్త్రవేత్తలు తీవ్రమైన దిగ్బ్రాంతికి లోనయ్యారు.  ప్రతి ఒక్కరు డీలా పడ్డారు.  వారిలో మనో ధైర్యాన్ని నింపేందుకు ప్రధాని మోడీ ఈ ఉదయం 8 గంటలకు ఇస్రో స్పేస్ సెంటర్ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు.  


భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ, ఇస్రో చేపట్టిన ప్రయోగాల గురించి మాట్లాడారు.  భవిషత్తులో ఎన్నో ప్రయోగాలు చేయాలని, మరిన్ని లక్ష్యాలు చేరుకోవడానికి కృషి చేయాలనీ అన్నారు.  గతంలో ఎంతో సాధించామని, ఎన్నో నిద్రలేని రాత్రులు శాస్త్రవేత్తలు గడిపారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రయోగాల నుంచి ఇంకా బలం పుంజుకోవాలని, ఆ బలంతో ముందుకు వెళ్లాలని అన్నారు.  


మీకు ఉపదేశం చేయడానికి రాలేదని, మీ నుంచి ప్రేరణ పొందటానికి వచ్చానని అన్నారు.  దేశం యావత్తు మీ వెంట ఉందని, చింతించాల్సిన అవసరం లేదని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  స్పేస్ లో కొత్త లక్ష్యాలను నిర్దేశించి మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు.  తప్పకుండా భవిష్యత్తులో గొప్ప గొప్ప ప్రయోగాలు చేయడానికి ఇది ఒక నాంది అని అయన అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: