ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగం 95% విజయవంతం అయ్యిందని, ల్యాండర్, రోవర్ తో సంబంధాలు తెగిపోయినా.. చంద్రుని కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ ఆరోగ్యంగా ఉందని, సంవత్సరం పాటు ఆర్బిటర్ నుంచి భూమికి సంకేతాలు వస్తూనే ఉంటాయని, చంద్రుని గురించి ఫోటోలు అక్కడి వాతావరణ పరిస్థితులను ఫోటోలు తీసి భూమికి పంపుతుందని శాస్త్రవేతలు చెప్తున్నారు.  


ల్యాండర్ ఏమైంది అనే విషయాన్ని కూడా ఆర్బిటర్ నుంచి త్వరలోనే సమాచారం అందుతుందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.  చంద్రయాన్ 2 ప్రయోగం చాలా చిన్నది.  భవిష్యత్తులో చంద్రయాన్ 2 కు మించిన ప్రయోగాలు చేయడానికి ఇస్రో రెడీ అయ్యింది. ఇస్రో వచ్చే రెండేళ్లలో 36 అంతరిక్ష ప్రయోగాలు చేయబోతున్నది.  ఇందులో ఒకటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.  నాసా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకునట్టుగానే ఇస్రో కూడా ప్రత్యేకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నది.  ఇది భారీ ప్రాజెక్ట్ అని చెప్పాలి.  


దీంతో పాటు 19 పీఎస్ఎల్వి రాకెట్లతో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపబోతోంది. అలాగే  జిఎస్ఎల్వి  మార్క్-2 ద్వారా 5, జిఎస్ఎల్వి  మార్క్ 3 ద్వారా 7 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపబోతోంది. వీటితో పాటు ఐదు చిన్న రాకెట్లను కూడా ప్రయోగించనుంది. ఇవన్నీ వచ్చే రెండేళ్లలో ఇస్రో చేపట్టబోతున్న ప్రయోగాలని చెప్పాలి.  అంతేకాదు, 2019-20లో ఆదిత్య ఎల్ 1 అనే ప్రూబ్ ని సూర్యుడి మీదకు పంపబోతున్నది.  సూర్యుడి కరోనా ఉపరితలాన్ని మరింత సమర్ధవంతంగా పరిశోధన చేస్తుంది.  


అక్కడి నుంచి  2022-23లో రెండో మంగళయాన్ మిషన్‌ను మార్స్ పైకి పంపబోతోంది. అలాగే  2023లో శుక్రగ్రహం పైకి ప్రత్యేక మిషన్‌ను పంపబోతోంది. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశ్యం శుక్రగ్రహం మీద మనుషులు జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి.  దీనికి సంబంధించిన ప్రయోగాలు ఇప్పటికే షురూ అయ్యాయి.  చంద్రయాన్ 3 ని కూడా త్వరలోనే ప్రయోగించబోతున్నది.  దీంతో పాటు ఇస్రో 10వేలకోట్ల రూపాయలతో గగన్ యాన్ ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధం అయ్యింది.  దీనికంటే ముందు 2020లో ఓ స్పేస్ షిప్ ను అంతరిక్షంలోకి ప్రయోగించబోతున్నది.  ఇలా ఎన్నో ప్రయోగాలను వచ్చే రెండేళ్ల వ్యవధిలో ఇస్రో చేపట్టబోతున్నది.  ఈ ప్రయోగాలు విజయవంతమైతే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: