వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో ఆధిపత్య పోరు తగ్గడం లేదు. మాజీమంత్రులైన ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్యల మధ్య మరింత దూరం పెరుగుతోంది. నియోజకవర్గంలో ఎవరికి వారు పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నారు. తాజాగా ముఖ్య మంత్రి దృష్టిలో పడేందుకు కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం కార్యకర్తలను కాళేశ్వరం టూర్ కు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను కాళేశ్వరం తీసుకెళ్లి అక్కడ ప్రాజెక్టు గొప్పతనాన్ని కేసీఆర్ పట్టుదలను వివరించి, అధినేత దృష్టిలో పడేందుకు కార్యచరణ రూపొందించారు.


కడియం శ్రీహరి కాళేశ్వరం టూర్ ప్రకటించిన ఒక్క రోజు వ్యవధిలోనే ఆయన కంటే ముందే ఎమ్మెల్యే రాజయ్య తన అనుచరులను తీసుకుని కాళేశ్వరం వెళ్ళివచ్చారు.దీనికి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వెంటబెట్టుకెళ్లారు. దాంతో మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య మధ్య నెలకొన్న విభేదాలు మరోమారు బయటపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పార్టీ వర్గాలు తీసుకెళ్లే విషయంలో స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో సాగుతున్న ఆధిపత్య పోరు మరోసారి బట్టబయలైంది.



ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులనూ కాళేశ్వరం బాట పట్టించే క్రమంలో వేర్వేరు తేదీలను ఖరారు చేయడం వివాదాస్పదమవుతోంది. ఒకే పార్టీలో స్టేషన్ ఘన్ పూర్ నుంచి రెండు గ్రూపుల ప్రతినిధులుగా ఉన్న కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో కార్యకర్తలు నలిగిపోతున్నారు.స్టేషన్ ఘన్ పూర్ లో గట్టి పట్టున్న ఇద్దరు నేతలూ ఒకరి కంటే ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి టిడిపి నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. టిడిపి హయాంలో మంత్రిగా సైతం పనిచేసారు. అదే నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య తర్వాత టీఆర్ ఎస్ లో చేరారు.



కాలక్రమంలో కడియం శ్రీహరి కూడా టీఆర్ ఎస్ లో చేరడంతో ఇద్దరు ప్రత్యర్ధులు ఒకే పార్టీలో ఉండి ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరును చాటుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఆ ఇద్దరూ పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. రెండు వేల పధ్ధెనిమిదిలో జరిగిన ఎన్నికలకు ముందు కడియం వర్గీయులు టీఆర్ ఎస్ కార్యకర్తల ఆవేదన సభ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఆవేదన సభలు కూడా ఇరువర్గాల మధ్య విభేదాలను మరింతగా పెంచాయి. దీంతో అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.



ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కేటీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. దాంతో ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పనిచేయటంతో రాజయ్య విజయం సాధించారు. దాంతో రెండు వర్గాల మధ్య అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా, పంచాయితీ ప్రాదేశిక ఎన్నికలతో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. అప్పటి నుండి మళ్లీ గ్రూపుల పోరు పెరుగుతూ వచ్చింది. తాజాగా కాళేశ్వరం టూర్ తో అది తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఒకే నియోజక వర్గం నుంచి రాజయ్య, శ్రీహరి వేర్వేరు తేదీల్లో కాళేశ్వరం యాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: