అధికారం లోకి వచ్చామన్న సంతోషం లేకుండా పోయింది ఆ నేతకు. పార్టీ పవర్లో ఉన్న, తమ చేతిలో పవర్ లేదు అన్న బాధ ఆ వర్గీయుల్ని కుమిలిపోయేలా చేస్తోంది. ఎమ్మెల్యే గా గెలిచిన సీనియార్టీ పేరుతో షాడో ఎమ్మెల్యేలుగా పార్టీ నేతలు చేస్తున్న హడావుడి సదరు నేతకు మింగుడు పడటం లేదట. దానికి తోడు ఇప్పుడు సొంత అనుచరులతోనే సరి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయంట. ఇంతకీ ఆ నేత ఎవరు. మొన్నటి వరకు షాడో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తితో తలనొప్పులు అనుకుంటే ఇప్పుడు సొంత వర్గంలోనే అసమ్మతి తయారవుతోందట చిలకలూరిపేట ఎమ్మెల్యేకి. అసలే ఉన్న గ్రూపులకు తోడు ఒకటి తర్వాత ఒకటిగా తయారవుతున్న వర్గాలతో పార్టీలో ఎవరికి వారు అసంతృప్తిగానే ఉంటున్నారు.



అధికారంలో ఉన్నామనే ఫీలింగ్ ఏ కలగటం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజక వర్గంలోని వైసీపీ నేతల పరిస్థితి ఇలా తయారైంది ఇప్పుడు. ఎమ్మెల్యే విడుదల రజినీకి పోటీగా మొన్నటి వరకు ఇంఛార్జ్ బాధ్యతలు చూసినా మర్రి రాజశేఖర్ వర్గం ఎదురు తిరిగి వ్యవహరించింది. బహిరంగంగానే ఇరువర్గాలకు చెందిన నేతలు ఆందోళనకు దిగారు. మర్రి రాజశేఖర్ పుట్టినరోజున ఏర్పాటు చేసిన బ్యానర్ల వివాదంతో వీరి మధ్య వర్గపోరు మున్సిపల్ కార్యాలయం సాక్షిగా బట్టబయలైంది. అంతేకాదు మర్రి పుట్టినరోజున పార్టీలోని చాలా మంది పెద్దలు ఆయన ఇంటికి వచ్చి మరీ శుభాకంక్షలు తెలిపారు. అయితే నియోజకవర్గం వరకూ వచ్చిన సదరు పార్టీ నేతలు స్థానిక ఎమ్మెల్యే విడుదల రజనీకి కనీసం ఫోన్ కూడా చేయలేదు.



నియోజక వర్గ ఎమ్మెల్యేకి తెలియకుండానే మరో నేత ఇంటికి వచ్చి పలకరించి వెళ్లడం కనీసం దారిలో ఉన్న ఎమ్మెల్యే ఇంటి వైపు తొంగి చూడకపోవడంతో రజనీ వర్గం చాలా గుర్రుగా ఉంది. పార్టీ ఇలా రెండు గ్రూపులుగా మారడంతో వార్డు స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా ఇష్టం లేకపోయినా ఏదో ఒక గ్రూపులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే గ్రూపులో ఉన్నవారికన్నా మర్రి వర్గంలోని వారికి అధిక ప్రాధాన్యత దక్కడం, పనులు కూడా వారికే ఈజీగా అవుతుండటం కూడా పార్టీ శ్రేణులకు అర్థం కాకుండా తయారవుతోంది. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగిన పలు కార్యక్రమాల్లో వేదికగా చేసుకుని రజనీ వర్గంలోని రెండో గ్రూపు చెలరేగిపోయింది. అప్పటికే పార్టీలో రెండు రెండు వర్గాలు ఉండటం, దానికి తోడు ఎమ్మెల్యే అనుచర వర్గం కూడా గ్రూపులు కడుతుండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.


రాత్రికి రాత్రి వైఎస్ విగ్రహం సాక్షిగా ఎమ్మెల్యే అనుచరులు లోని రెండు వర్గాలూ గొడవపడ్డాయి. ఆధిపత్యం కోసం జరిగిన ఈ ఘర్షణలో కొందరికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. నర్సరావుపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. పంతాలకు పోయిన ఆ గ్రూపులు ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేయాలని భావించినప్పటికీ, ఆఖరు నిమిషంలో పార్టీ పెద్దల నుండి ఫోన్ రావడంతో తెల్లవారకుండానే ఆసుపత్రి నుంచి సర్దుకొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేట వైసిపి నేతలకు ఇలాంటి గ్రూపు తగాదాలు సర్వసాధారణమైపోయాయి. పెద్దల జోక్యం చేసుకున్నా ఆ గ్రూప్ వార్ కూ తెర పడకపోతుండటం పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.





మరింత సమాచారం తెలుసుకోండి: