కాన్వాయ్ కావాలి, కొంచెం సిబ్బంది ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా మర్యాద కావాలి. ప్రోటోకాల్ పాటించాలి, జనంతో కనెక్ట్ కావాలి, పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నేతా కోరుకునేది ఇదే. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఏదో ఒక క్యాబినెట్ ర్యాంక్ పదవి కోసం తెగ ట్రై చేస్తున్నారట. వారిలో ఒకరు బాజిరెడ్డి గోవర్దన్, రెండోవారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి మంత్రి గా ఉన్నారు.



జిల్లా కు రెండో మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు. దీంతో ఖాళీగా ఉన్న కేబినెట్ ర్యాంకు తో సమానమైన పోస్టు కోసం ఈ ఇద్దరు నేతలు వెతికితే ఓ పోస్టు తగిలిందట. ఆ పోస్టే రైతు సమన్వయ సమితి ఛైర్మన్. నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువ. అక్కడ రైతు సమస్యలూ ఎక్కువే. దీంతో తమ జిల్లాకిస్తే న్యాయం జరుగుతుందని వీరంటున్నారట. మరో వైపు ఇప్పటి దాకా ఛైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో పదవికి రాజీనామా చేశారు. ఈయన రాజీనామాతో ఖాళీ అయిన పోస్టును తమకివ్వాలని వీరు కోరుతున్నారట.



నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ కేసీఆర్ కేబినెట్ లో ఛాన్స్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు కానీ, సామాజిక సమీకరణల వల్ల ఆయనకు ఛాన్స్ రాలేదు. కొడుకు జడ్పీ ఛైర్మన్ అవకాశం వస్తుందని ఆశించారు. అక్కడా నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు ఈ పదవైనా సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారట. అటు జీవన్ రెడ్డి కూడా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. సామాజికవర్గ కోణంలో సమన్వయ సమితి పదవి తనకే దక్కుతుందని గట్టిగా చెప్తున్నారట. అయితే ఇప్పటికే ఈ పదవిపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. దీంతో సిఎం కెసిఆర్ ఎవరిని కరుణిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: