ఏపీ ఎన్నికల్లో ఒక్క శాతం కూడా ఓట్లు తెచ్చుకోని భారతీయ జనతా పార్టీ...రాష్ట్రంలో బలపడటానికి ఎన్ని స్కెచ్ లు వేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్రంలో అధికారం ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష టీడీపీ నేతలనీ తమవైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలో చాలామంది టీడీపీ నేతలు బీజేపీలో చేరగా, మరికొందరు చేరేందుకు చూస్తున్నారు. అయితే ఓ వైపు ప్రతిపక్ష టీడీపీని వీక్ చేస్తున్న బీజేపీ రాంగ్ రూటులో అధికార వైసీపీపై ఎటాక్ కు పెద్ద స్కెచ్ వేస్తోంది.


అందులో భాగంగా జగన్ పై మతం కార్డు వాడుతూ రాజకీయాలు చేస్తున్నారు. ఇక దాని మీద వివిధ అంశాలని తెరపైకి తెచ్చి జగన్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ వాటిని జగన్ సమర్ధవంతంగా తిప్పికొడుతూ ముందుకెళుతున్నారు. అయినా సరే బీజేపీ మాత్రం ఎటాక్ ఆపడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని అల్లరి చేశారు. దీంతో సుబ్బారెడ్డి పుట్టుపూర్వోత్తరాలు చెబితే సైలెంట్ అయ్యారు.


అలాగే జగన్ తిరుపతి బస్సుల్లో టికెట్లలో జెరూసలేం యాత్రకు సంబంధించి ప్రచారం జరగడంతో దాని మీద పెద్ద రాద్దాంతం చేశారు. కానీ ఆ టికెట్లు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ ప్రింట్ అయ్యాయని తెలియడంతో నోరు మూసేశారు. అలాగే హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదని అనవసర ఆరోపణలు చేశారు. దీంతో జగన్ తిరుమలతో సహా ఏపీలోని మొత్తం హిందూ దేవాలయాల్లో అన్య మతానికి చెందిన ఉద్యోగులు ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు.


అంతే కాదు, తిరుపతిలో మద్యం దుకాణాలు సైతం ఉండరాదని నిర్ణయం తీసుకున్నారు. ఇక శ్రీశైలం గుడి విషయంలో బీజేపీ రచ్చ చేసింది. ఆలయ ఈవో ముస్లిం అంటూ హడావిడి చేయడంతో వెంటనే జగన్ ఈవోని మార్చేశారు. ఇక తాజాగా పేద పాస్టర్లకు వైఎస్ జగన్ సర్కార్ జీతాలు ఇవ్వడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. దీని మీద ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్ మండిపడ్డారు. ప్రజాధనాన్ని ఎలా ఇస్తారంటూ నిలదీశారు. అయితే జగన్ ఈ హామీ ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఇచ్చారు. అప్పుడు వీళ్ళు నోరు మెదపలేదు కానీ ఇప్పుడు హడావిడి చేస్తున్నారు.


అలాగే ఏపీలో పేదలకు గృహ నిర్మాణానికి అవసరమైన భూములు లేకపోతే దేవాలయ భూములు నిరుపయోగంగా ఉన్నవి పరిశీలించాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇక దీన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. మొత్తం మీద బీజేపీ జగన్ పై ఎటాక్ చేయడానికి ఏ అంశం దొరుకుతుందా కాచుకుని కూర్చుంది. అది కూడా మతానికి సంబంధించే జగన్ పై రాంగ్ ఎటాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: