ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో మరో ఎన్నికలు జరగడానికి సన్నహలు జరుగుతున్నాయి. స్థానికంగా పార్టీల బలాబలాలు తేల్చే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు అధికార వైసీపీ ఇప్పటి నుండే సన్నద్ధం అవుతుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.


అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్య నేతలకు ఓ పరీక్ష పెట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత కొన్ని కీలక పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీటీడీ బోర్డు సభ్యులను జగన్ ఖరారు చేసారు. ఇంకా అనేక పదవులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఈ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలని కొందరు నేతలు కోరుతుండగా, ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అనుయాయులకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ క్రమంలోనే జగన్ వారికి ఓ పరీక్ష పెట్టారు. నామినేటెడ్ పోస్టులకు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముడి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలను రాబట్టడంలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో అలాంటి వారికి నామినేటెడ్‌ పోస్టులను కట్టబెట్టేందుకు పరోక్ష నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు నేతల మధ్య ఇప్పటికే ఉన్న పోటీని తగ్గించేందుకు వీలవుతుందని, మరోవైపు అనుకూల ఫలితాల కోసం పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తారని భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలను లక్ష్యంగా తీసుకుని, పార్టీలో నేతలు, కేడర్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు.


పదవుల కోసం నెలకొని ఉన్న ఒత్తిడి..స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల్లో సైతం వైసీపీ జెండా ఎగుర వేసి , పూర్తిగా టీడీపీని కోలుకోలేని దెబ్బ తీయాలని జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక త్వరలోనే దీనిపై కార్యాచరణ రూపొందించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకునేందుకు జగన్ సిద్ధమయ్యారని సమాచారం. మొత్తం మీద వైసీపీ నేతలు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటితేనే నామినేటెడ్ పదవి దక్కించుకోగలరు.


మరింత సమాచారం తెలుసుకోండి: