ప్రకాశం జిల్లా చీరాల నియోజక వర్గం పొలిటికల్ వార్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. చీరాలలో ప్రతి పక్ష అధికారపక్ష నాయకుల మధ్య వివాదాలతో ఎవరికి సర్ధిచెప్పలేక అధికారులు సతమతం అయిపోతున్నారట. చీరాల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి సీనియర్ నేత కరణం బలరాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ నుండి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఓటమిపాలయ్యారు. గతంలో క్రిష్ణమోహన్ చీరాల నియోజక వర్గం నుండి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పదేళ్ల పాటు చీరాలలో ఆమంచి కృష్ణ మోహన్ హవానే సాగింది. అయితే తాజా ఎన్నికల్లో కరణం బలరాం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన కూడా చీరలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.



చీరాలలో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరై తన ముద్ర వేసుకునేందుకు బలరాం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే ఇద్దరి నేతల మధ్య వివాదం మొదలైంది. బలరాం హాజరయ్యే కార్యక్రమానికి ఆమంచి హాజరు కాకపోయినా ఆయన అనుచరులు బలరాంను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ వాలింటీర్ల ఎంపికలో ఇద్దరు నేతలు తమ వర్గీయులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులపై ఒత్తిడి చేశారు. కరణం బలరాం అయితే ఏకంగా ఎంపీడీవో కార్యాలయంలో కూర్చుని తమ వర్గీయులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. వాలింటీర్ల ఎంపికలో ఎమ్మెల్యే కరణం బలరాం తనను బెదిరించాడంటూ చీరల ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.



దీనికి తోడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సైతం బలరామ్ ని అడ్డుకునేందుకు ఆమంచి అనుచరులు ప్రయత్నించారు. అదే రోజు తనను దూషించారంటూ ఆమంచి అనుచరులు ఇచ్చిన ఫిర్యాదుతో కరణం బలరాం పై మరో కేసు కూడా నమోదైంది. ఇలా రోజూ ఏదో ఒక విషయంలో ఇద్దరి నేతల మధ్య చీరాలలో వార్ కామనైపోయింది. దీంతో నియోజకవర్గంలో సీనియర్ నేత ఎమ్మెల్యే కరణం బలరాం అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మధ్య అధికార సిబ్బంది నలిగిపోతున్నారట. పోలీసు, రెవిన్యూ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా మారిందట.



ఇద్దరి నేతల మధ్య ఎవరికీ సర్ధిచెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారట. ప్రశాంతంగా వుండే చీరాలలో ఉద్యోగం చేయాలని అనుకునే అధికారులు ఇక్కడ నుండి బయట పడితే చాలు అనుకునే పరిస్థితి వచ్చిందట. ఎన్నికల ఫలితాల వచ్చి మూడు నెలలు దాటేసరికి చీరాలలో పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇద్దరి మధ్య వార్ ఏ స్థాయికి వెళ్తుందోనన్న ఆందోళన చీరాల నియోజక వర్గంలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మధ్య పొలిటికల్ వార్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: