ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 7 వ తేదీని  తెలుగు జాతి  మొత్తం గర్వించదగిన రోజుగా రాష్ట్ర తెలుగు భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. తెలుగు భాషను రాజ భాషగా దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి  నాడు ప్రకటించారని చెప్పారు. తెలుగు భాషా అధ్యయన కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కి కావాలని కోరామని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు హయాంలో అధ్యయన కేంద్రంపై నిర్లక్ష్యం వహించారన్నారు. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి తెలుగు భాషా  అధ్యయన కేంద్రం తీసుకురావాలని నిర్ణయించారని తెలిపారు.


తెలుగు భాషా సంఘం అధ్యక్షని హోదాలో భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుని కలిశామని చెప్పారు. తిక్కన నడయాడిన నేల అయిన  నెల్లూరులో  తెలుగు భాష అధ్యయన కేంద్రాన్నిచేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఎనిమిది యేళ్ల కల ఇంత కాలానికి నెరవేరడం చాలా  ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చొరవతో త్వరితగతిన కార్యరూపం దాల్చిందని చెప్పారు. ఈ విషయంలో తాను చేసిన ప్రయత్నం ఫలించినందుకు ఎంతో ఆనందంగా ఉందని యార్లగడ్డ తెలిపారు.  



తెలుగు భాషా అధ్యయన కేంద్రం తెలుగు నేలలో ఉండేలా చేసిన ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడికి పాదాభివందనం చేస్తునట్టు యార్లగడ్డ చెప్పారు. మైసూరులో ఉన్న కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని చెప్పారు. ఇది తెలుగు ప్రజలందరూ గర్వించదగిన అంశమని అయన అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును  బోధించాలన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. అందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని లక్ష్మి ప్రసాద్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: