తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారయింది .  ఆదివారం  సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు  రాజ్‌భవన్‌లో తగిన  ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ని ఆదేశించారు . ఆదివారం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న తమిళిసై సౌందర్ రాజన్ కు ఇప్పటికే  కేసీఆర్  సమాచారం అందించినట్లు తెలుస్తోంది .

మంత్రివర్గం నుంచి ఇద్దరు మంత్రులకు కేసీఆర్ ఉద్వాసన పలకనున్నారని , మరో ఆరు మందికి అవకాశం ఇవ్వనున్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . మంత్రి వర్గం నుంచి ఇద్దరికి ఉద్వాసన ఖాయమన్న  ఊహాగానాల నేపధ్యం లో ఎవరా?..  ఆ ఇద్దరు అమాత్యులు అన్నదానిపై పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది .

టీఆరెస్ వర్గాల కథనం ప్రకారం... వైద్యారోగ్య శాఖమంత్రి ఈటెల రాజేందర్ , కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిలకు కేసీఆర్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే అవకాశాలున్నాయని అంటున్నారు . అదే నిజమైతే గత కొన్నిరోజులుగా ఈటెల... ఇక ఇంటికేనంటూ జరుగుతున్న ప్రచారం నిజం కానుంది .ఇక ఉమ్మడి రంగారెడ్డి నుంచి కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించి టీఆరెస్ లో చేరిన సబితాఇంద్రారెడ్డి కి అవకాశం  కల్పించాలని కేసీఆర్  నిర్ణయించడంతో , మల్లారెడ్డి ని మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది .

మొత్తం ఆరుమందిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తుండగా ,  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ లు   గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ,   కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ , మాజీ మంత్రి హరీశ్‌రావు తోపాటు ఎస్టీ కోటాలో సండ్ర వెంకట వీరయ్య , సత్యవతి రాథోడ్ , రేఖానాయక్ లలో ఒకరికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది . 



మరింత సమాచారం తెలుసుకోండి: