యాదాద్రి ఆయన ప్రాకారాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ బొమ్మ, ఆ పార్టీ గుర్తు కారు చెక్కిన శిల్పులు ఇప్పుడు అందుకు కారణాలుగా భలే వింత కథలు చెబుతున్నారు. తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని సర్ది చెపుతున్నారు. తమకు ఎవరూ అలా బొమ్మలు చెక్కమని చెప్పలేదని తామే చెక్కామని వింత వాదన వినిపిస్తున్నారు. అంతే కాదు.. తాము చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.


మన చరిత్రను భావితరాలకు తెలిపేందుకే అలా చెక్కించామని యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, సీఈవో కిషన్‌రావు అన్నారు. ఏ దేవాలయంలోనైనా ఆనాటి కాలంలోని పరిస్థితులను తెలిపేవిధంగా శిల్పులు శిలలను చెక్కుతారని సమర్థించుకున్నారు. అంతేకానీ వారికి వేరే ఉద్దేశాలు ఉండవని స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయ స్తంభాలపై కేసీఆర్ కిట్స్, చార్మినార్, తెలంగాణ మ్యాప్, తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర తదితర బొమ్మలు చెక్కినట్టు చెప్పారు.


శిల్పాలను చెక్కే శిల్పులకు ఫలానా బొమ్మలే చెక్కాలనే నియమం ఉండదని, చరిత్రలో ఉండాలని భావించిన బొమ్మలను చెక్కుతారని కిషన్‌రావు తెలిపారు. ఇందులోభాగంగానే యాదాద్రి ఆలయం బయటి ప్రాకారం స్తంభాలపై మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, కమలం పువ్వు, ఎడ్లబండి, సైకిల్, కారు, క్రికెట్ ఆట, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితర బొమ్మలను చెక్కారని చెప్పారు. కేసీఆర్ బొమ్మను చెక్కడాన్ని వ్యక్తిగతంగా చూడకూడదట.


తాను ఎవరి ప్రోద్బలంతోనూ కేసీఆర్ బొమ్మను చెక్కలేదని, ప్రపంచంలోనే ఒక గొప్ప కట్టడంగా ఉండేలా యాదాద్రి దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న కేసీఆర్‌ను దైవసమానుడిగా భావించి, ఆయన బొమ్మను స్తంభంపై చెక్కానని శిల్పి హరిప్రసాద్ వారికి ఓ లేఖ ద్వారా తెలియజేశాడట. అభ్యంతరాలు వస్తే కేసీఆర్ బొమ్మను తొలిగిస్తామన్నారు కిషన్ రావు. యాదాద్రి లోపలిప్రాకారంలో మొత్తం దేవుళ్ల బొమ్మలే ఉంటాయని, బయట మాత్రమే సమాజంలోని సమకాలీన పరిస్థితులను తెలిపే చిత్రాలను చెక్కుతారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి: