కులమతాలకు అతీతమైన సమాజమే లక్ష్యం గా అందరూ అడుగులు వేస్తున్న తరుణంలో, ఒక విద్యాసంస్థ లో ఆరవ  తరగతి విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నలను చూస్తే ఎవరికైనా మతిపోవడం ఖాయం . విద్యాలయాల్లోనే సమానత్వం ఉంటుందని అందరు భావిస్తుంటే , విద్యాసంస్థలే కుల, మతాలను ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రశ్నలు సంధించడం ఏమిటన్న ఆవేదన కలుగక మానదు .    సి బి ఎస్ ఈ సిలబస్ ఆధారంగా విద్యాబుద్ధులు నేర్పించే కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ఇటీవల ఆరవ  తరగతి విద్యార్థులకు  నిర్వహించిన పరీక్షల్లో అడిగిన రెండు విచిత్రమైన ప్రశ్నలు దేశ వ్యాప్తంగా వివాదాన్ని రాజేస్తున్నాయి.


  దళితులు,  మైనార్టీలను ఉద్దేశించి వివాదాస్పద ప్రశ్నలు, కేంద్రీయ విద్యాలయ  ప్రశ్నాపత్రంలో చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.  ఈ ప్రశ్నలు దళిత,  మైనార్టీల మనోభావాలు దెబ్బతీసేలా  ఉండటం పట్ల రాజకీయ పక్షాలు సైతం మండిపడుతున్నాయి.  కేంద్రీయ విద్యాలయ పాఠశాల పరీక్షా పత్రాల్లో దళితులు అంటే ఎవరు అని ప్రశ్నించి , ఆ  ప్రశ్నకు నాలుగు అప్షన్లను ఇచ్చారు.  దళితులంటే విదేశీయులు... అంటరానివారు ... మధ్యతరగతి వారు ...ఎగువ తరగతి వారు ... అనే  అప్షన్లు ఇచ్చి విద్యార్థులను సమాధానం రాయమన్నారు  .  ముస్లింలకు సంబంధించిన ప్రశ్నకు, ముస్లిం లలో  ఈ క్రింది సాధారణ అంశం ఏది ? అని ప్రశ్నిస్తూ ,  ముస్లింలు బాలికలను పాఠశాలకు పంపారు... వారు శుద్ధ శాఖాహారులు... రోజా  సమయంలో నిద్రపోరు... పైవన్నీ అంటూ అప్షన్లు  ఇచ్చి సమాధానం రాయమన్నారు.


 ఈ ప్రశ్నల ద్వారా  భావిభారత పౌరాలైన ప్రాథమికస్థాయి  విద్యార్థులను కేంద్రీయ విద్యాలయ సంస్థ  ఎటు వైపు నడిపిస్తుందన్న అనుమానం  తలెత్తుతోంది.  భవిష్యత్తు సమాజ నిర్మాతలైన చిన్నారుల  మెదళ్ళలో కులం,  మతం అనే  విషాన్ని నింపే ప్రయత్నం చేస్తోందన్న  విమర్శలు వినిపిస్తున్నాయి.  కుల,  మత రహిత సమాజాన్ని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్న ఈ  తరుణంలో  విద్యార్థులకు  ఈ తరహా ప్రశ్నలు సంధించడం ఏమిటని  విద్యావేత్తలు మండిపడుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: