కేసీఆర్ నేడు తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు అందుకుంటున్న తమిళిసైకు మొదటి రోజే కీలకమైన అవకాశాన్ని అందిస్తున్నారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో మరో ఐదు, ఆరుగురికి మంత్రి వర్గంలో చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. కేసీఆర్ కేబినెట్లో మంత్రులుగా నలుగురైదురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి.. వీరికి సీట్లు పక్కా అని తెలుస్తోంది.


వీరు కాకుండా ఇంకా పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతీరాథోడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి కీలక నేతగా ఉన్న హరీశ్ రావును కొంత కాలంగా కేసీఆర్ దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. ఆయన్ను మళ్లీ దగ్గరకు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే కేటీఆర్ ను కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటారట.


ఈ నెల 9న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రమే ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌గా దాస్యం వినయ్‌ భాస్కర్‌ కు అవకాశం కల్పించారు. ఇక విప్‌లుగా గొంగిడి సునీత, గంపా గోవర్ధన్‌, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగా కాంతారావు, బాల్క సుమన్‌లను ముఖ్యమంత్రి నియమించారు. అసెంబ్లీ నిర్వహణ సమయంలో ప్రభుత్వ విప్, విప్ లకు కీలక పాత్ర ఉంటుంది. ఇక ఇప్పుడు చీఫ్ విప్, విప్ లు, మంత్రి వర్గం పూర్తయిన తర్వాత మిగిలిన కీలక పదవులను కూడా నియమించి పాలనను కొత్త పుంతలు తొక్కించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావంతోపాటు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు పతనమవడం, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా తగ్గుతుండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: