ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలుచేస్తూ, భారీగా జరిమానాలు విధిస్తున్న నేపధ్యంలో వాహనదారుల్లో రోజురోజుకి  ఆందోళన పెరిగిపోతుంది. చలానాలను ఎన్నోరెట్లు పెంచిన నేపధ్యంలో దేశ ప్రజలు  తమ వాహనాలను రోడ్ల మీదకు తీసుకురావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు ఈ జరిమానాల తలనొప్పులను తప్పించుకునేందుకు మెట్రోతో పాటు, ప్రభుత్వ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో,  బస్సులలో రద్దీ మరింతగా పెరుగుతోంది. 

ఈ సందర్భంగా ఢిల్లీలోని ఛతర్పూర్‌కు చెందిన నిషా సింగ్ మాట్లాడుతూ తన దగ్గర కారు, స్కూటీ ఉన్నదన్నారు. ఇప్పటివరకూ ఈ వాహనాలలోనే ఆఫీసుకు వెళ్లివచ్చేవాడిని అని చెప్పారు. అయితే ఇప్పుడు రెడ్‌లైన్ జంప్, జీబ్రా క్రాసింగ్, ఓవర్ స్పీడ్, పొల్యూషన్ చెకింగ్ తదితర అంశాలలో చలానా మొత్తాన్ని భారీగా పెంచారన్నారు. తాను ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటిస్తుంటానని, అయితే ఎప్పుడైనా పొరపాటు జరిగితే నియమాలను ఉల్లంఘించినట్లవుతున్నదని అన్నారు. 

దీనికి ఫలితంగా ఐదు వేల రూపాయల నుంచి10 వేల వరకూ చలానా పడుతుందన్నారు. అందుకే తన వాహనాలను ఇంట్లోనే వదిలివేసి ఆఫీసుకు మెట్రోలో వెళ్లివస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని వాహనదారులను ఎవరిని కదిలించినా, ఇదే విధమైన సమాధానం చెబుతున్నారు. కాగా ఢిల్లీలో మెట్రో, డీటీసీలలో ప్రయాణించే వారి సంఖ్య పెరగడంతో ఆయా సంస్థలు తమ సేవలను మరింత విస్తృతం చేయనున్నాయని తెలుస్తోంది.

కాకపోతే ప్రభుత్వం దీనిపై ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ...సామాన్య ప్రజలకి ఈ చలానాలు భారంగా తయారైపోయాయి ... అలాగే ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండానే చలానాలకు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు పెంచడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే చాలామంది చలనాలను తప్పించుకోవాలంటే వాహనాల్ని రోడ్డుపైకి తీసుకురాకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. చలానాలకు భయపడి చాలామంది ఆఫీసులకి బస్సుల్లో వెళ్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: