వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. ఆగస్టు నెల 15 వ తేదీ నుండి గ్రామ, వార్డ్ వాలంటీర్లు విధుల్లో చేరారు. ప్రతి 50 ఇళ్ళకు ఒకరు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఇంటివద్దకు చేర్చేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించింది. ఆగస్టు నెలలో వాలంటీరుగా విధుల్లో చేరిన నవీన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా పండువారిగూడెంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 
 
పండువారిగూడెంకు చెందిన పండు నవీన వాలంటీరుగా కొన్ని రోజుల క్రితం విధుల్లో చేరారు. శనివారం రోజు ఉదయం మంగ అనే మహిళ తన ఆధార్ కార్డును ఎందుకు ఆన్ లైన్ చేయటం లేదని నవీనను ప్రశ్నించింది. ఆధార్ కార్డులోని ఇంటిపేరును మార్చాలని కోరుతున్నా ఎందుకు సరిచేసి ఆన్ లైన్లో మార్పులు చేయటం లేదంటూ నవీనను మంగ దుర్భాషలాడింది. ఆధార్ కార్డులోని మార్పులు తన పరిధిలోకి రాదని నవీన చెప్పినప్పటికీ మంగ దుర్భాషలాడుతూనే ఉంది. 
 
మంగ అన్న మాటలతో బాధపడిన నవీన రోదిస్తూ ఇంటికి వచ్చింది. తండ్రి శ్రీరామమూర్తికి జరిగిన విషయం గురించి చెప్పింది. తండ్రి ఆమెను వారించి వ్యవసాయ పనులకు వెళ్ళిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన నవీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు నవీన ఉరి వేసుకుంది. 
 
ఇంట్లో సూసైడ్ నోట్ దొరికినట్లు తండ్రి శ్రీరామమూర్తి పోలీసులకు చెప్పారు. శ్రీరామమూర్తి ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఎస్సై ఎస్ కె సాధిక్ కుటుంబసభ్యులను, తోటి వాలంటీర్లను ఈ విషయం గురించి విచారించినట్లు తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: