ఏపీలో పదమూడు జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత సరైన రాజధాని నేటికీ లేని పరిస్థితి ఉంది. అయిదేళ్ళ పాలనలో చంద్రబాబు రాజధాని అమరావతి అని గ్రాఫిక్స్ చూపించారు తప్ప అక్కడ ఏమీ పెద్దగా అభివ్రుధ్ధి జరగలేదన్నది అందరికీ తెలిసిందే. అక్కడ అభివ్రుధ్ధి అంటే ఏపీ బడ్జెట్లు కొన్ని అలా పూర్తిగా రాసిచ్చేసినా జరగదేమో. కనీసం అమరావ‌తి  కి ఇప్పటివరకూ పిన్ కోడ్ కూడా లేదు, 


ఇక మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో మాట చెప్పారు, అమరావతి రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ కూడా బాబు విడుదల చేయ‌లేదట. ఈ పరిస్థితుల్లో చూసుకుంటే అమరావతి అన్నది కార్యరూపం దాల్చాలంటే కొన్ని తరాలు పట్టేలా ఉంది. దానికి మేలు మార్గం ఏంటి అంటే అధికార, పరిపాలన, అభివ్రుధ్ధి వికేంద్రీకరణ. అలా చేయడం వల్ల మాత్రమే అమరావతి మీద ఫోకస్ తగ్గుతుంది. జగన్ సర్కార్ ఏంచేయాలనుకుంటుందో ఇదమిద్దగా తెలియడం లేదు కానీ అన్ని ప్రాంతాల నుంచి రాజధాని డిమాండ్ మాత్రం మళ్ళీ వినిపిస్తోంది.


తాజాగా రాయలసీమలో రాజధాని స్థాయి నగరంతోపాటు, సాగు నీటి ప్రాజెక్టుల అభివ్రుధ్ధికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక హోదా, ప్యాకేజి కావాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. రాయలసీమ తెలంగాణా కంటే బాగా వెనకబడిన ప్రాంతమని ఆయన గుర్తు చేశారు. సీమలో పరిశ్రమలు పెట్టాలంటే ముందు అభివ్రుధ్ధి చేయాలని కూడా ఆయన కోరుతున్నారు.


అదే విధంగా ఏపీలో నాలుగు రాజధానుల డిమాండ్ ని మళ్ళీ ఆయన వినిపించారు. ఓ విధంగా జగన్ అభివ్రుధ్ధి వికేంద్రీకరణకు టీజీ మద్దతుగా ఉన్నారు. అయితే రాయలసీమ అభివ్రుధ్ధి పట్ల జగన్ ఏం చేస్తారన్నది చూడాలి. ఈ మధ్యన  శ్రీకాకుళంలో పర్యటించిన ముఖ్యమంత్రి విశాఖను ఐటీ రాజధాని చేస్తామని చెప్పారు. 


ఇక ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని పారదోలేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటు డిమాండ్లు  ఇలాగే ఉన్నాయి, మరో వైపు ప్రభుత్వం ఆలోచనలు కూడా అదే తీరుగా ఉండడంతో  రాజధానుల రచ్చ మరో మారు తారస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: