ఏపీ ప్రభుత్వానికి టెస్టింగ్ టైమ్ మొదలు కాబోతోంది. ఇప్పటి వరకు కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్.. ఇకపై వాటిని అమలు చేయబోతోంది. అమలు విషయంలో ఏ మాత్రం చిన్నపాటి తేడా వచ్చినా.. ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు కూడా సంక్షేమ పథకాల అమలుపై ఓ కన్నేసి ఉంచాయి.


ఏపీలో జగన్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో ఇన్ని నిర్ణయాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదనే చెప్పాలి. ఈ క్రమంలో మిగిలిన విషయాల సంగతి పక్కన పెడితే.. సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం చాలా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుందనే మంచి పేరునే సంపాదించింది. ఈ క్రమంలో ప్రకటించి.. నిర్ణయాలు తీసుకున్న పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది సర్కార్. అందులో భాగంగా కీలకమైన పథకాలతోపాటు.. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టి ప్రజలకు మెరుగైన సేవలు.. నాణ్యమైన సేవలందిస్తామని ప్రభుత్వం గట్టిగానే చెబుతోంది.


ఇప్పటికే ఇసుక పాలసీని రూపొందించిన సర్కార్.. సెప్టెంబర్‌ ఐదో తేదీ నుంచి అమల్లోకి తేనుంది. ఇసుక రీచ్ ల నుంచి ఏపీఎండీసీ ద్వారా మైనింగ్ జరిపించి అమ్మకాలు జరపాలని నిర్ణయించింది. ఈ వ్యవహరం ఇంకా మొదలు పెట్టక ముందే టెండర్ల రింగ్ కావడంతో ఆ టెండర్లను రద్దు చేసింది. వీటిని తిరిగి యుద్ద ప్రాతిపదికన ఖరారు చేయాల్సి ఉంది. అలాగే ఇకపై ఏపీ బెవరెజేస్ కార్పోరేషన్ తరపున మద్యం దుకాణాలను నడపాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టుగా 500 దుకాణాలను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వ సంస్థ నిర్వహించే మద్యం దుకాణాల పనితీరు వ్యవహరం ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని జగన్ సర్కార్ భావించింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫీడ్ బ్యాక్‌ ప్రజల నుంచి ఏ విధంగా ఉండబోతోందనేది ప్రభుత్వ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 


అలాగే అక్టోబర్‌ నెలలో వైఎస్సార్ రైతు భరోసా వంటి ప్రతిష్టాత్మక పథకం ప్రారంభం కాబోతోంది. దీంతో పాటు జనవరిలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది సర్కార్.  గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. గ్రామ సచివాలయాల ఏర్పాటు.. ఉద్యోగ నియామక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటి వరకు నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే.. వాటిని అమలు చేయడమనేది మరో అంకం. కీలకమైన ఈ అంకాన్ని జగన్ సర్కార్ ఏ విధంగా డీల్ చేస్తుంది..? ఎంత సక్సెస్‌ చేయగలుగుతుందనేది అధికార పార్టీలోనూ ఉత్కంఠను రెకేత్తిస్తోంది. ఈ పథకాలు కనుక ప్రభుత్వం అనుకున్న విధంగా అమలైతే.. ప్రభుత్వం.. అధికార పార్టీ ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో వీటి అమల్లో ఏ మాత్రం తేడా జరిగినా.. ఇబ్బందులు కూడా అదే స్థాయిలో ఉంటాయనే భావనా వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: