జగన్ వంద రోజుల పాలన ముగిసింది. పరిపాలనే చేతకాదనే విమర్శల పెద్ద ఎత్తున వచ్చిన క్రమంలో తనదైన మార్క్ తో  ముందుకెళ్తున్నారు జగన్‌. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ సంక్షేమ పథకాల విషయంలో జగన్‌ ఆలోచనా విధానం ఒకలా ఉంటే.. కీలకమైన ఒకటి రెండు అంశాలకు సంబంధించి మాత్రం జగన్‌ ఆలోచనా విధానం భిన్నంగా ఉంటోంది. 


అనేక కష్టాలు.. అనేక ఇబ్బందులు.. సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్షంగా వ్యవహరిస్తుండడం.. ఢిల్లీ స్థాయి ఒత్తిళ్లను తట్టుకుని నిలబడడం లాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు జగన్‌మోహన్ రెడ్డి. అప్పటి వరకు ప్రత్యర్థి పార్టీల నుంచి ఒకటే విమర్శ. జగన్‌కు అనుభవం శూన్యం. పరిపాలన చేతకాదు.. దూకుడు ఎక్కువ.. ఆలోచన తక్కువ. అధికారం చేపట్టాక కూడా సీఎం జగన్‌ పై ఇవే రకమైన ఆరోపణలను.. విమర్శలను కంటిన్యూ చేస్తూనే ఉంది టీడీపీ. అయితే జగన్‌ మాత్రం వీటిని పట్టించుకోకుండా.. పరిపాలనలో తనదైన ముద్ర వేసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి పాలన స్టైల్‌ చూస్తుంటే.. సంక్షేమానికి పెద్ద పీట వేయడం.. ఇచ్చిన మాటను ఎంత కష్టమైనా సరే తట్టుకుని అమలు చేయడం. పరిపాలన విషయంలో జగన్‌ నమ్ముకున్న అంశాలు ఇవేననే విషయం స్పష్టంగా కన్పిస్తోంది.


ఆర్టీసీ విలీనం అనగానే రాజకీయంగా ఏ పార్టీ కూడా టచ్‌ చేయడానికి సాహసించదు. ఆర్టీసీని బలోపేతం చేస్తామని.. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామనే హామీలే తప్ప.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామనే హామీని ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పటి వరకు ఇచ్చింది లేదు.. ఇచ్చినా.. దాన్ని నెరవేర్చింది లేదు. అయితే ఇంతటి కష్టసాధ్యమైన అంశాన్ని చాలా సునాసయంగా తేల్చేశారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. ఆర్టీసీ విలీనంలో ఉన్న సాంకేతిక సమస్యలను సాకుగా చూపి విలీనాన్ని అడ్డుకునే ప్రయత్నం కొందరు ఉన్నతాధికారులు చేశారు. ఆర్టీసీ విలీనానికి సాంకేతికమైన ఇబ్బంది ఉంటుంది కాబట్టి.. ఆ సంస్థను అలాగే ఉంచేసి.. ఉద్యోగులను విలీనం చేసుకుంటే ఇబ్బంది ఉండదనే ఆలోచన చేశారు జగన్. కార్మికులకు  ఉద్యోగ భద్రత ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏ ఒక్కరూ తప్పు పట్టలేని పరిస్థితికి వచ్చింది. దీని వల్ల తాను చెప్పింది చేసినట్టు అయింది.. రాజకీయంగా ఇమేజ్‌ పెంచుకోవడంతోపాటు.. ఆర్టీసీ కార్మికుల ఓటు బ్యాంకును పెంచుకున్నారు జగన్.


ఇక రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ విషయంలోనూ జగన్‌ సర్కార్‌ తెలివిగా వ్యవహరిస్తోంది. రీ-సైక్లింగ్‌ అరికట్టాలంటే రేషన్‌ కార్డుల కోత ఒక్కటే మార్గమనే భావనలో ఉండేవి ప్రభుత్వాలు. అయితే వీటిని టచ్‌ చేస్తే.. రాజకీయంగా అనేక ఇబ్బందులు వస్తాయనే ఆందోళనతో ఎవ్వరూ టచ్‌ చేసే సాహసం చేసే వారు కాదు. అయితే రేషన్ బియ్యం రీ-సైక్లింగ్‌ను అరికట్టడానికి ప్రత్యేకంగా రైస్‌ కార్డులివ్వాలనే వినూత్న ఆలోచనను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు. రైస్‌ కార్డులు కనుక జారీ చేస్తే.. రేషన్ బియ్యం రీ-సైక్లింగ్‌ ఆగిపోతుందని ఇప్పుడు అధికారులు సైతం చెబుతున్నారు. ఇది అమల్లోకి వస్తే నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందించడం ఏమంత కష్టం కాదనేది అధికారుల మాట. ఇప్పటి వరకు ఈ తరహా ఆలోచన తమకు కూడా రాలేదని.. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ తరహాలో కొత్తగా ఆలోచన చేస్తారనే అంశాన్ని తాము ఊహించలేదనే చర్చ అధికారిక వర్గాల్లో జరుగుతోంది. తాను చేసిన ప్రకటనలు నూటికి నూరు పాళ్లు అమలయ్యేలా ఆలోచనలు చేస్తున్నారనడానికి ఈ రెండు విషయాలే మచ్చు తునకలంటున్నాయి అధికారిక వర్గాలు.


అయితే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి అసలైన సమస్య సంపద సృష్టి దగ్గరే వస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు సంక్షేమ కార్యక్రమాల అమల్లో.. తన పరిపాలన విధానమేంటోననే అంశాల్లో కొద్దిపాటి క్లారిటీ ఇచ్చిన జగన్.. సంపద సృష్టి విషయంలో కూడా తనదైన ముద్ర వేస్తే బెటర్‌ సీఎం కావడం ఖాయమంటున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: