కేసీయార్ అంటేనే రాజకీయ మాస్టర్ మైండ్ అంటారు. ఆయన తెలంగాణాను సాధించింది కూడా ఇదే మైండ్ గేమ్ తో. ఇక ఆరేళ్ళుగా సీఎంగా ఎదురులేని రాజకీయ జీవితాన్ని అనుభవిస్తున్న కేసీయార్ కి ఇపుడు అసలైన అగ్ని పరీక్ష మొదలైంది. ఆయన కొన్నాళ్ళుగా రిలాక్స్ గా ఉండడంలేదు. తిరుగులేదనుకున్న స్టేజ్ నుంచి సవాళ్లకు జవాబు చెప్పే స్టేజ్ కి వచ్చారు. ఓ విధంగా ఇది  కేసీయార్ చేజేతులా చేసుకున్నదే.


ఆయన బీజేపీతో తొలి అయిదేళ్లు సజావుగా సంబంధాలు నెరిపారు. ఆ రాజకీయ లాభాలను కూడా ఆయన పొందారు. ముందస్తు ఎన్నికలు తెలంగాణాలో పెట్టుకుని మరీ విజయఢంకా మోగించారు. ఆ తరువాతనే బీజేపీతో సంబంధాలు చెడిపోయాయి. కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీయార్ ఆరాటం మోడీ షాలనే ధిక్కరించేలా చేసింది. అనూహ్యంగా మళ్లీ కేంద్రంలో బీజేపీ బంపర్ మెజారిటీతో రావడంతో కేసీయార్ ఇరకాటంలో పడ్డారు.


ఇక తెలంగాణాలో నాలుగు ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకోవడంతో చాలెంజ్ మొదలైంది. గవర్నర్ గా నరసింహాన్ని తప్పించి కరడు కట్టిన బీజేపీ నాయకురాలు, తమిల్ సై సౌందర్యరాజన్ని రంగంలోకి దింపారు. ఈ నేపధ్యంలో కేసీయార్ సొంత ఇంటిని సర్దుకోవడం మొదలుపెట్టారు. మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెట్టిన మేనల్లుడినే మళ్ళీ పీఠం ఎక్కించారు. తనపై బాంబుల్లాంటి మాటలు అన్న మరో మంత్రి ఈటెల రాజెందర్ ని సైతం  పిలిచి మాట్లాడాల్సివచ్చింది.


ఆరేళ్ళుగా మహిళా మంత్రి లేకుండానే సాగిన తెలంగాణా సర్కార్లో ఇపుడు ఇద్దరు మహిళలను తీసుకోవాల్సివచ్చింది. అన్ని వర్గాల సమతూకం పాటించాల్సివచ్చింది. మొత్తానికి కొత్త గవర్నర్ చేతుల మీదుగా మంత్రుల ప్రమాణం జరిపించి కేసీయార్ బీజేపీకి తన సందేశాన్ని పంపించగలిగారు.


టీయారెస్ లో అసమ్మతిని వాడుకుని ఎదగాలని, కేసీయార్ కోటను కూల్చాలను పావులు కదుపుతున్న బీజేపీకి ఓ విధంగా కేసీయార్ చెక్ పెట్టారు. ఇపుడు జనంలో ఉంది అసలు కధ. అక్కడ వ్యతిరేకత రాకుండా కేసీయార్ చూసుకోవాలి. అదే విధంగా మంత్రి పదవిని ఆశించిన వారు చాలామంది ఉన్నారు. వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నామినేటెడ్ పదవులను పంచినా కూడా ఇంకా నేతలలో అసమ్మతి జ్వాలా రగిలితే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: