తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. తన కేబినెట్ లో కొత్తగా ఆరుగురికి  అవకాశం కల్పించారు. ప్రస్తుతం  విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న గుంట కండ్ల జగదీష్ రెడ్డి  కి శాఖ మార్చి విద్యుత్ శాఖను కేటాయించారు.  అయితే అనూహ్యంగా  హరీష్ రావుకు ఆర్థిక శాఖను అప్పగించారు. తొలుత అసలు హరీష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి భావించినట్లు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  అయితే ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ  పరిణామాల నేపథ్యంలో  హరీష్ ను  తప్పనిసరి  పరిస్థితుల్లో మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది .


 ఒకవైపు ఈటెల దిక్కార స్వరం,  మరొకవైపు యాదాద్రి ప్రాకారాలపై  వివాదాస్పద బొమ్మలు చెక్కడం, ఇదే సమయం లో తనకు వెన్నుదన్నుగా నిల్చిన గవర్నర్ నర్సింహన్ బీజేపీ నాయకత్వం సాగనంపి, నూతన గవర్నర్ ను నియమించడం ...  ఇలా ఒకదాని వెంట ఒకటి గా చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యం లో  గులాబి బాస్ కాసింత వెనక్కి తగ్గి , హరీష్ ను మంత్రివర్గం లోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది . ఈటెల ధిక్కార స్వరానికి , హరీష్ తోడైతే , ఈ పరిణామాన్ని  బీజేపీ  తనకు అనుకూలంగా మల్చుకుంటే మొదటికే మోసం వస్తుందని భావించే కేసీఆర్ , హరీష్ ను మంత్రివర్గం లోకి తీసుకోవడమే కాకుండా , ఈటెల రాజేందర్ జోలికి వెళ్లేందుకు సాహసించలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .


 ఈటెల కు ప్రస్తుతానికి పదవి గండం గడిచినప్పటికీ , రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చునని అంటున్నారు . గతం లో గులాబీబాస్ ను ధిక్కరించిన వారెవ్వరు ఆ పార్టీలో కొనసాగిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు . ఇక కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ కు మంత్రివర్గం లో స్థానం కల్పించడం వెనుక ఈటెల రాజేందర్ కు చెక్ చెప్పాలన్న ముందస్తు  వ్యూహం అయి ఉండవచ్చునని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: