గడచిన కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉండటంతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 13.9 అడుగుల నీటిమట్టం ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద నమోదైంది. భారీ స్థాయిలో నీటిమట్టం నమోదు కావటంతో అధికారులు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయటం జరిగింది. 
 
వరద నియంత్రణ అధికారి ఆర్ మోహనరావు గోదావరికి దిగువ ప్రాంతాల్లో ఉన్న అధికారులను మరియు ఎగువ ప్రాంతాల్లో ఉన్న అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సముద్రంలోకి 13.19 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు సమాచారం. డెల్టా కాల్వకు 8,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం వద్ద కూడా 51.2 అడుగుల నీటిమట్టం నమోదైందని సమాచారం. ప్రస్తుతం భద్రాచలం దగ్గర కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 
 
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం ప్రాంతంలో వరద ఉధృతి పెరగటంతో బయటి ప్రపంచంతో 36 గ్రామాలకు సంబంధాలు 4 రోజులనుండి లేకుండా పోయినట్లు తెలుస్తుంది. గండిపోచమ్మ ఆలయంలోనికి భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో గండి పోచమ్మ ఆలయంను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. 14 గ్రామాల గిరిజన ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
వరద బాధితులు నాలుగు రోజుల నుండి వరద కొనసాగుతూనే ఉన్నా అధికారులు కనీసం భోజనాలు కూడా ఏర్పాటు చేయటం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం ఆర్డీవో శ్రీనివాసరావు వరద ముప్పు ఉన్న గ్రామాల్లో నిన్న పర్యటించారు. వరద బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు నుండి అల్పాహారం మరియు భోజనాలను అందిస్తామని ఆర్డీవో శ్రీనివాసరావు బాధితులకు చెప్పినట్లు తెలుస్తోంది. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కూడా లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో చెప్పినట్లు తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: