తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన చేశారు. వాస్తవ లెక్కల ఆధారంగా ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో కేసీయార్ బడ్జెట్ ను ప్రవేశపెట్టగా మండలిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. సాగునీటి రంగానికి, సంక్షేమ రంగానికి బడ్జెట్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. 
 
సీఎం కేసీయార్ మాట్లాడుతూ గడచిన ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించామని చెప్పారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచిందని చెప్పారు.ప్రభుత్వ ఆర్థిక విధానాలతో మూలధన వ్యయం పెరిగింది.రైతు బంధు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఐటీ ఎగుమతుల విలువ లక్షా పది వేల కోట్ల రుపాయలకు పెరిగిందని సీఎం కేసీయార్ చెప్పారు. 2019 - 20 బడ్జెట్ లక్షా 46 వేల 492 కోట్లుగా ప్రతిపాదిత వ్యయంగా ఉంది. ఇందులో రెవెన్యూ వ్యయం లక్షా 11 వేల 55 కోట్లు కాగా మూలధన వ్యయం 17 వేల 274 కోట్ల రుపాయలుగా ఉంది. ఆర్థికలోటు 24 వేల 81 కోట్ల రుపాయలుగా ఉంది. 
 
ప్రతి నెల గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం 339 కోట్ల రుపాయలు కేటాయించింది. గ్రామాల అభివృధ్ధికై ప్రభుత్వం ఈ నిధులు కేటాయించింది. రైతు భీమాకు ప్రభుత్వం 1135 కోట్ల రుపాయలు కేటాయించింది. మున్సిపాలిటీలకు 1764 కోట్లు, పంచాయితీలకు 2714 కోట్ల రుపాయలు బడ్జెట్లో కేటాయించింది. ఆరోగ్య శ్రీకి 1336 కోట్ల రుపాయలు కేటాయించింది. రైతు బంధు పథకానికి 12 వేల కోట్ల రుపాయలు కేటాయించింది. 
 
ఆసరా పెన్షన్లకు 9402 కోట్ల రుపాయలు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. రుణ మాఫీకి 6 వేల కోట్ల రుపాయలు కేటాయించింది. విద్యుత్ సబ్సిడీల కోసం 8 వేల కోట్ల రుపాయలు కేటాయించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: