తెలంగాణ‌లో కొద్ది రోజులుగా అంద‌రిని ఊరిస్తూ వ‌చ్చిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎట్ట‌కేల‌కు పూర్త‌య్యింది. ద‌స‌రా త‌ర్వాతే ఉంటుంద‌ని అనుకున్న టైంలో కేసీఆర్ స‌డెన్‌గా ద‌స‌రాకు ముందే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కంప్లీట్ చేసేశారు. ఇక హ‌రీష్‌రావును కేసీఆర్ ప‌క్క‌న పెట్టేస్తార‌న్న ఊహాగానాల‌కు చెక్ పెడుతూ ఆయ‌న‌కు ఏకంగా ఆర్థిక‌మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. కేటీఆర్‌కు మాత్రం ఆయ‌న గ‌తంలో నిర్వ‌హించిన ఐటీ, మునిసిప‌ల్ మంత్రిత్వ శాఖ‌లే ఇచ్చారు. ఇక ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే కేసీఆర్ హ‌రీష్‌రావును అస‌లు సిస‌లైన అగ్నిప‌రీక్ష పెట్టిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.


ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఆర్థిక‌మాంద్యం తీవ్రంగా త‌రుముకు వ‌స్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక శాఖ నిర్వ‌హించ‌డం అంటే ఎవ‌రికి అయినా క‌త్తిమీద సాములాంటిదే. ఇక కేసీఆర్ సోమ‌వారం అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ పద్దు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభం నెల‌కొన్న నేప‌థ్యంలో తీవ్ర లోటు బ‌డ్జెట్‌లో ఉన్న తెలంగాణ‌లో ఆర్థిక‌శాఖా మంత్రి ప‌ద‌వి నిర్వ‌హించ‌డం హ‌రీష్‌కు క‌త్తిమీద సాములాంటిదే అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.


దేశ ఆర్థిక‌మాంద్య ప్ర‌భావం తెలంగాణ‌పై ఎక్కువుగా ప‌డింద‌న్న కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో మూలధన వ్యయం తక్కువగా ఉండేదని గుర్తుచేశారు. 11.2 శాతం ఉండేదని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. క్రమంగా పెరిగి 16.9 శాతానికి చేరి .. దేశంలో ముందువరుసలో ఉందని తెలిపారు. ఇక ష‌రా మామూలుగానే తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌న్న విష‌యం మ‌రోసారి చెప్పారు.


రాష్ట్రం ఏర్ప‌డిన ఈ ఐదారేళ్ల‌లోనే తెలంగాణ‌లో తీవ్ర‌మైన ఆర్థిక లోటు ఏర్ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో హ‌రీష్‌ను ఆర్థిక‌శాఖ‌కు మంత్రిని చేయ‌డం అంటే హ‌రీష్‌పై న‌మ్మ‌కం కావ‌చ్చు లేదా ఏదైనా తేడా వ‌స్తే ఆ బ్యాడ్ అంతా అత‌డి ఖాతాలోకే వెళ్లిపోతుంద‌న్న వ్యూహం కావొచ్చ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు ర‌క‌ర‌కాలుగా విశ్లేషించుకుంటున్నాయి. వాస్త‌వంగా హ‌రీష్‌కు భారీ నీటిపారుద‌ల శాఖ బాగా ఇష్టం. హ‌రీష్‌కు అత్యంత ప్రీతిపాత్ర‌మైన శాఖ‌ను కాకుండా హ‌రీష్ ఆర్థిక శాఖ ఇవ్వడంలో అస‌లు లోగుట్టు ఏంటో కేసీఆర్‌కే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: