ఉగ్రవాద నిర్మూలన కోసం చర్యలు తీసుకోకుంటే పాక్‌ను ఏకాకిని చేయాలని.. అంతర్జాతీయ సమాజం భావిస్తున్న తరుణంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ అభివృద్ధి కోసం యూఏఈ ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వగా.. పాక్‌లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది చైనా.


పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు మరో అడుగు ముందుకేసింది చైనా. పాక్‌ సంక్షేమ ప్రాజెక్టుల్లో ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. చైనాపాక్‌ మధ్య ఉన్న ఎకనామిక్‌ కారిడార్‌ సంతృప్తికరంగా ఉందన్న చైనా రాయబారి యవో జింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. చైనా-పాకిస్థాన్‌ ఉచిత వాణిజ్య ఒప్పందం రెండో దశను ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేస్తామంటోంది చైనా. పాకిస్థాన్లో ఉన్న వ్యాపార అవకాశాల గురించి చైనాలో.. అవగాహన కల్పించేందుకు పాక్‌కు చెందిన మహిళా వ్యాపారులను పంపనున్నట్లు తెలిపింది. యూఏఈ ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వగా.. ఐఎంఎఫ్ కూడా 6 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడం కోసం సూత్రప్రాయంగా అంగీకరించింది.  


మరోవైపు.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్.. చేయూతనిచ్చే వారికోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడిదారుల కోసం పాకిస్థాన్ ఆర్థిక వేత్తలు బెల్లీ డ్యాన్సర్లతో వల విసురుతున్నారంటూ... విమర్శలు వెల్లు వెత్తుతున్నా పట్టించుకోవడం లేదు. బెల్లీ డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించి పెట్టుబడిదారులకు కనువిందు చేసిన ప్రయత్నాన్ని ఆ దేశ ప్రజలే తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాకిస్థాన్‌ దిగజారి ప్రవర్తించడంపై నెటిజన్లు తనదైన శైలిలో ఓ ఆట ఆడుకుంటున్నారు. భారత్‌ చంద్రయాన్‌-2 మిషన్‌లో నిమగ్నమై ఉంటే.. పాక్‌ మాత్రం బెల్లీ మిషన్‌ను సమర్థంగా నిర్వహించిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరైతే.. పెట్టుబడులు ఆహ్వానానికి పాక్‌ కొత్తమార్గం కనుగొందంటూ ట్వీట్‌ల వర్షం కురిపిస్తున్నారు. పాక్ పై ఇప్పటికే అనేక దేశాలు గుర్రుగా ఉంటే.. చైనా కూడా అదే దారిలో వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: