తెలంగాణ బడ్జెట్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. కేసీఆర్ కు పాలనపై అవగాహన లేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించాయి. గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై వచ్చిన ఆదాయం తన ఘనతగా చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఆదాయం తగ్గేసరికి కేంద్రంపై నెపం నెడుతున్నారని విమర్శించాయి. అటు విపక్షాల విమర్శల్ని టీఆర్ఎస్ కొట్టిపారేసింది. 


అసెంబ్లీలో ప్రవేశపెట్టింది బడ్జెట్ కాదు.. కేసీఆర్ ఫెయిల్యూర్స్ బుక్ అన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. వ్యవసాయం, సాగునీటి రంగం, విద్య, వైద్యం, ఉపాధి కల్పన.. ఇలా ఏది చూసినా.. సరైన కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతికత లేదన్నారు జీవన్ రెడ్డి. 


కేసీఆర్ పరిపాలన ఫలితాలు ఇప్పుడే మొదలయ్యాయని చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గత ప్రభుత్వాలు సృష్టించిన సంపదను ఐదేళ్లు అనుభవించిన కేసీఆర్.. ఇప్పుడు చేతులెత్తేశారని సెటైర్లేశారు. ఎన్నికల హామీలు పూర్తిస్థాయి బడ్జెట్లో కూడా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు భట్టి. 


బడ్జెట్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బడ్జెట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. కేంద్రాన్ని బూచిగా చూపి తన తప్పుల్ని కేసీఆర్ కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శించారు కాషాయ పార్టీ నేతలు. 


విపక్షాల విమర్శల్లో పస లేదన్నారు టీఆర్ఎస్ నేతలు. మిగతా రాష్ట్రాలు, కేంద్ర బడ్జెట్ తో పోలిస్తే.. కేసీఆర్ మంచి బడ్జెట్ పెట్టారని ప్రశంసల జల్లు కురిపించారు. ఆదాయం తగ్గినా.. సంక్షేమం ఆగదని చెప్పారని కొనియాడారు. రాష్ట్రం 2 లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం 30 వేల కోట్లే తిరిగిచ్చిందని మండిపడ్డారు గులాబీ నేతలు. మొత్తానికి తెలంగాణ బడ్జెట్ పై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. బడ్జెట్ లో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవని కొట్టిపారేస్తున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం విపక్ష నేతల వ్యాఖ్యలను తోసిపుచ్చుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: