దాదాపు ఏడాది నిరీక్ష‌ణ‌ త‌ర్వాత‌....తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ మంత్రి ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న అనంత‌రం కేసీఆర్ అప్ప‌గించిన ఈ బాధ్య‌త‌ల నేప‌థ్యంలో..గులాబీ పార్టీ యువ‌నేత‌ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా మీడియాతో స‌మావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్ కీల‌క అంశాల‌పై స్పందించారు. ప్ర‌ధానంగా ప్ర‌స్తుతం వ‌ణికిస్తున్న వైర‌ల్ ఫీవ‌ర్ల‌పై కేటీఆర్ ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. 


సీజన్ మార్పు వల్ల వైరల్ ఫీవర్ వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ``మా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల అన్ని ఆస్పత్రులు సందర్శించారు. ఈ రోజు ఉదయం పుర‌పాల‌క‌పై సమీక్షించుకున్నాం. మెరుగైన సేవలు ఎలా ఉండాలి అనే దానిపై చ‌ర్చించాం.బల్దియాలోని అన్ని విభాగాల అదికారులు మీటింగ్‌లో పాల్గొన్నారు. నగర ప్రజలు డెంగీపై ఆందోళన చెందుతున్నారు. బల్దియాను సీజన్లలో వచ్చే వ్యాదుల నివారణ, చర్యలపై క్యాలెండర్ ను రూపొందించాలని కోరాం. సీజన్‌లో వచ్చే వ్యాదులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరాము.`` అని అన్నారు.


ప్రతి డిప్యూటీ కమిషనర్, అందరు అధికారులు రోజుకు‌ మూడు అవగాహన‌ సదస్సులు నిర్వహించాలి అని కోరారు. ``స్కూల్, స్లమ్, అపార్ట్‌మెంట్ లో సదస్సులు పెట్టాలి. అక్కడ వ్యాదులు ఎలా వస్తయి‌ అనేది అవగాహన కల్పించాలి. నేను, ఆరోగ్య శాఖ మంత్రి, మేయర్ అందరం ఇందులో భాగస్వాములమవుతాము. నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ప్రజల భాగస్వామ్యం లేనిది ఏం జరగదు. 16వ తేది వరకు ఓపెన్ గార్బేజ్ పాయింట్లను తొలగించాలి. నగర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలి. నగరంలో 106 ‌బస్తీ దవాఖానులు ఉన్నయి. ఇందులో సాయంత్రం ఓపీలను ప్రారంభించాము. సీయం అనుమతితో బస్తీ దవాఖానలను పెంచుతాం. స్కూల్లు, కాలేజీల్లో వ్యాదుల నివారణకు తీసుకోవాల్సిన వాటిపై అవగాహన కల్పించాలి. అన్ని జ్వరాలు డెంగీ కావు, లేని భయాలను మీడియా కల్పించవద్దు. వ్యాది తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. ఇంకా తగ్గుతుంది. వర్షం వల్ల రోడ్లు చాలా దెబ్బతిన్నవి. సానిటేషన్, రోడ్లపై గుణాత్మక మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందరు విస్తృతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి` అని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: