మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై విషం కక్కుతూ నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి వైవిబి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. మొన్నటివరకు రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. రాజధాని  ప్రాంతం ముంపుకి గురౌతుందన్నారు. తరువాత రాజదానిలో రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడు తాజాగా రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు కాబట్టి ఎలా పరిపాలన చేస్తాం అని అంటున్నారు.


అమరావతిపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం గెజిట్‌ను ఇవ్వడం జరిగిందని, 2014 డిసెంబర్‌ 30వ తేదిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారని వెల్లడించారు. అంతేకాకుండా అదేరోజున జీవో నెంబర్‌ 254ను విడుదల చేసి కోర్‌ కేపిటల్‌ ప్రాంతాన్ని అందులో ప్రస్తావించడం జరిగింది.బొత్స సత్యనారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తన శాఖకు సంబంధించిన అమరావతి రాజధానిపై, కోర్‌ కేపిటల్‌ ప్రాంతంపై సీఆర్‌డీఏపై తెలుసుకోకపోవడం వారి అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. ప్రభుత్వంలో ఒక కీలకమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సమంజసంకాదు. బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే ఆయన చేత సీఎం జగన్‌ మాట్లాడిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. తన శాఖకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా తెలుసుకోకుండా ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు ఆయన రాష్ట్ర ప్రలకు క్షమాపణ చెప్పాలి. ఆయన చేస్తున్న ఈ విషప్రచారం కారణంగా ఆయన మంత్రిగా అనర్హుడన్నారు. 



టీడీపీ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందని పుస్తకాలు ప్రచురించారు. ఒక్క రాజధాని అమరావతిలోనే రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అందులో పేర్కొన్నారు. కానీ వైసీపీ అధికారం చేపట్టి 100 రోజులైనా ఒక్క రూపాయి అవినీతిని కూడా ఎందుకు నిరూపించలేకపోయిందని ప్రశ్నించారు. రూ.2లక్షల కోట్ల అవినీతి జరిగిందని అబద్దాలు ప్రచారం చేస్తున్న వైసీపీ కనీసం 2 కోట్ల అవినీతిని కూడా బయటపెట్టలేకపోయినందుకు చెంపలేసుకొని చంద్రబాబునాయుడుగారివద్ద క్షమాపణ కోరాలన్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని తేటతెల్లమైందన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై బొత్స సత్యనారాయణ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 2011లో బాలకృష్ణ వియ్యంకుడు తుళ్లూరుకి వంద కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేటలో 500 ఎకరాల భూమి కొన్నారని, అది టీడీపీ ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వల్లే జరిగిందని ఆరోపించడంలో అర్థంలేదన్నారు. 



2011కు అమరావతి రాజధానికి ఏంటి సంబంధం అని, అప్పుడు రాష్ట్రం విడిపోతుందని ఎవరూ కలగనలేదన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరం లక్ష రూపాయల లెక్కన ఇస్తే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో దాన్ని రద్దు చేసి ఎకరం రూ.16 లక్షల లెక్కన ఇచ్చినా ఆ భూములను వాళ్లు తీసుకోలేదని, ఇప్పటికీ ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. అలాగే సుజనా చౌదరి కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ అబద్ధపు ప్రచారాలను మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఉపయోగపడాలని హితవు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: