తెలంగాణ‌లో తాజాగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగింది. కొత్త‌గా ఆరుగురు మంత్రుల‌ను తీసుకున్నారు. గ‌తానికి భిన్నంగా.. అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో కేసీఆర్‌.. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మ‌హిళ‌ల‌కు కూడా పెద్ద‌పీట వేశారు. అది కూడా ఒక ఓసీ.. ఒక ఎస్టీకి కూడా కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, గ‌త ఏడాది డిసెంబ‌రులో ఏర్పాటు చేసుకున్న తొలి కేబినెట్‌లో త‌న కుటుంబాన్ని దూరం పెట్టిన కేసీఆర్ తాజా విస్త‌ర‌ణ‌లో మాత్రం త‌న మేన‌ల్లుడు, వ్యూహ‌క‌ర్త‌గా పేరు తెచ్చుకున్న హ‌రీష్‌రావుకు, త‌న కుమారుడు, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అధ్య‌క్షుడు కేటీఆర్‌కు కూడా కేబినెట్‌లో చోటు క‌ల్పించారు.


అయితే, ఇంత వ‌రకు బాగానే ఉన్నా..కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు మిన‌హా మిగిలిన మంత్రుల‌కు స్వేచ్ఛ ఉంటుందా? అనేది ఇప్పుడు కీల‌క అంశంగా మారింది. దీనిపై నే మీడియా వ‌ర్గాలు పెద్ద ఎత్తున చ‌ర్చిస్తున్నాయి. గ‌తంలోనూ ఇదే త‌ర‌హా చ‌ర్చ సాగింది.దీనికి ప్ర‌ధాన కార‌ణం.. గ‌తంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌.. అన్ని శాఖ‌ల్లోనూ వేలు పెట్టేవారు. ముఖ్యంగా కీల‌క‌మైన హోం శాఖ లోనూ శాంతి భ‌ద్ర‌త‌ల‌ను త‌మ‌కిందే ఉంచుకున్నారు. త‌మ క‌నుస‌న్న‌ల్లోనే మంత్రులను న‌డిపార‌నే పేరు తెచ్చుకున్నారు.


ఇక‌, ఇటీవ‌ల ప‌రిణామం కూడా నిజానికి కేబినెట్‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు లేక పోయినా.. కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ చెప్ప‌క‌పోతే.. ఏదీ జ‌ర‌గ‌ద‌నే రేంజ్‌లో అధికారులు వ్య‌వ‌హ‌రించారు.త‌న‌కు సంబంధం లేక పోయినా.. కేటీఆర్ జోక్యం చేసుకుంటున్నారని ఒక‌రిద్ద‌రు మంత్రులు కూడా వాపోయారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న నేరుగా కేబినెట్‌లో చోటు సంపాయించుకున్నారు. దీంతో ఆయ‌న ప్ర‌మేయం లేకుండా మంత్రులు స్వతంత్రంగా నిర్ణ‌యాలు తీసుకునేందుకు, అధికారుల‌ను ఆదేశించేందుకు అవ‌కాశం ఉంటుందా? అనేది తాజాగా చ‌ర్చ‌నీయాంశం అయింది.


ఈ విష‌యంలో కేసీఆర్ కూడా చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో త‌మ‌కు స్వేచ్ఛ ఉంటుంద‌నే అభిప్రాయం విష‌యంలో మంత్రులు కూడా మాట్లాడ‌లేని ప‌రిస్తితి నెల‌కొంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: