గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అతిపిన్న రాష్ట్రమైన తెలంగాణ.. అభివృద్ధి, సంక్షేమ, పాలనా సంస్కరణల్లో దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. సీఎం కేసీఆర్ సర్కారు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరు మిగితా రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బంగారు తెలంగాణ లక్ష్యం సాధించేందుకు ప్రభుత్వం పటిష్టపునాదులు వేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తో కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. 


కాగా, ఆదివారం కొత్త గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన తండ్రికి గవర్నర్ తమిళిసై పాదాభివందనం చేశారు. అనంత‌రం ఆమె మంత్రుల‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.


తమిళిసై సౌందరరాజన్ తండ్రి అనంతన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు. దీంతో చిన్నప్పటినుంచే ఆమెపై రాజకీయాల ప్రభావం పడింది. మ ద్రాస్ మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడే విద్యార్థిసంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. పుట్టింది కాంగ్రెస్ కుటుంబంలోనే అయి నా.. ఆమె బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. పార్టీలో క్రియాశీల కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో దక్షిణ చెన్త్నె జిల్లా వైద్యవిభాగం కార్యదర్శిగా పనిచేశారు. 2001లో వైద్యవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2005లో జాతీ య సహ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. 2010లో తమిళనాడు బీజేపీకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యా రు. 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరించారు. 2014లో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో ఇటీవల జరిగిన జల ఉద్యమంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. తాజాగా ఆమె నేతృత్వంలో తమిళనాడులో 44.5 లక్షల బీజేపీ సభ్యత్వాలు నమోదయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: