రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఓడ‌లు బ‌ళ్లు-బ‌ళ్లు ఓడ‌లు అయిపోవ‌డం నేటి రాజ‌కీయాల్లో కామ‌న్‌గా జ‌రిగేదే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే తెలంగాణ‌లోనూ జ‌రిగింది. తాజాగా సీఎం కేసీఆర్ త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించారు. ఈ క్ర‌మంలో ఎవ‌రినీ తీసేయ‌క‌పోయినా.. ఆరుగురు కొత్త‌వారికి ఛాన్స్ ఇచ్చారు. వీరిలో ఇద్ద‌రు త‌న కుటుంబానికి చెందిన కేటీఆర్‌, హ‌రీష్‌రావే ఉన్నారు. ఇక‌, న‌లుగురులో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు. మ‌రో ఇద్ద‌రిలో కీలక‌మైన పువ్వాడ అజ‌య్ ఉండ‌డం ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింది.


ఖ‌మ్మం జిల్లాకు చెందిన పువ్వాడ నాగేశ్వ‌ర‌రావు కుమారుడు పువ్వాడ అజ‌య్ కుమార్‌. టీఆర్ ఎస్‌లో కేటీఆ ర్ వ‌ర్గంగా ఉన్న ఆయ‌న‌.. మంత్రి ప‌ద‌వి పొంద‌డంపై చ‌ర్చల‌మీద చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వాస్త‌వానికి కేసీఆర్ మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తే.. ఖ‌చ్చితంగా ఖ‌మ్మం నుంచి మాజీ మంత్రితుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఉంటా ర‌ని అంద‌రూ అనుకున్నారు. టీడీపీ నుంచి వ‌చ్చిన తుమ్మ‌ల‌కు గ‌తంలో కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు.. జిల్లాలోనూ కీల‌క ప‌ద‌వి ఇచ్చి.. ఉప ఎన్నిక స‌హా ఖ‌మ్మంలో కీల‌కంగా చక్రం తిప్పేందుకు ఛాన్స్ ఇచ్చారు.


ఇక‌, గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, అంత‌ర్గ‌త క‌ల‌హాలు పెరిగిపోయాయి. జిల్లాపై తుమ్మ‌ల ఆధిప‌త్య ధోర‌ణి కొన‌సాగింది. దీంతో పార్టీలో నేత‌ల మ‌ధ్య కుమ్మ‌లాట‌లు పెరిగాయి. తుమ్మ‌ల కేసీఆర్ వ‌ర్గంగా పేరు తెచ్చుకోగా, ఈయ‌నను అంత‌ర్గ‌తంగా విభేదించే పువ్వాడ కేటీఆర్ వ‌ర్గంగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి పెరిగింది.


తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కేటీఆర్ సూచించిన వారిలో పువ్వాడ ఉన్నార‌ని, కేటీఆర్‌కు ప్రాధాన్యం పెంచుతున్న క్ర‌మంలోనే ఇప్పుడు తుమ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టి పువ్వాడ‌కు ఛాన్స్ ఇచ్చార‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన తుమ్మ‌ల‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వ‌ర్గంలో అవ‌కాశం ఇవ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు త‌ర‌చుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజా కేబినెట్ విస్త‌ర‌ణ త‌ర్వాత అస‌లు వాస్త‌వం తెలిసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: