గులాబీ కోట‌లో వ‌రుసగా అసంతృప్త‌ బాంబులు పేలుతూనే ఉన్నాయి. మొన్న మంత్రి ఈట‌ల‌.. నిన్న ఎమ్మెల్యే ర‌స‌మ‌యి.. తాజాగా.. మాజీ మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి. రోజురోజుకూ గులాబీ ఓనర్లు పెరిగిపోతున్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఎవ‌రి భిక్ష కాద‌ని, గులాబీ ఓన‌ర్ల‌లో ఒక‌డినంటూ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఇటీవ‌ల హుజూరాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ఏకంగా గురుపూజోత్స‌వం నాడే.. ఉపాధ్యాయుల సమ‌క్షంలో మ‌రోబాంబు పేల్చారు.


తెలంగాణ‌లో ఏమీ మార‌లేద‌ని పాఠ‌శాల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బోర్డుపోయి.. తెలంగాణ బోర్డు మాత్ర‌మే వ‌చ్చింద‌ని ఆయ‌న త‌న అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు. ఈ చ‌ర్చ కొన‌సాగుతుండ‌గానే.. మాజీ మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా సీఎం కేసీఆర్‌పైనే త‌న అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు.  తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నానని, అయితే కౌన్సిల్‌లో ఉండమని కేసీఆర్ అన్నారని తన అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు.


సీఎం కేసీఆర్ మా ఇంటి (టీఆర్ఎస్‌)కి పెద్దఅని, తామంతా ఓనర్లమని అన్నారు. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమని నాయని స్పష్టం చేశారు. ఇక నాయిని ఆ వ్యాఖ్య‌లు చేసిన కొద్ది సేప‌టికే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజ‌య్య సైతం అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో 12 శాతం ఉన్న మాదిగ‌ల‌కు ఒక్క మంత్రి ప‌ద‌వి కూడా లేద‌ని ఆయ‌న వాపోయారు. ఇక ఒక్కో అసంతృప్త నేత ఏదోలా త‌మ అసమ్మ‌తి స్వ‌రాలు వినిపిస్తున్నారు.


ఈ జాబితాలో నెక్ట్స్ మ‌రో మాజీ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రే బ్లాస్ట్ అవుతార‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. గ‌త ట‌ర్మ్‌లో ఏకంగా ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న ఇప్పుడు ఆయ‌న కేవ‌లం ఎమ్మెల్సీగా ఉన్నారు. త‌న‌తో పాటు త‌న కుమార్తె రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు. ఇక క‌డియం పార్టీ మారి కేసీఆర్‌కు షాక్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కూడా సొంత పార్టీ వాళ్లే చెపుతున్నారు. ఇక గులాబీ ఓన‌ర్లం అనే మాట ఇంకా ఎంత మంది నుంచి వ‌స్తుందో చూడాలి మ‌రి. అయితే.. ఈ ధిక్కార గ‌ళాల సంఖ్య ముందుముందు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నాయి. ఈ ప‌రిణామాల‌తో ఏం జ‌రుగుతుందోన‌ని గులాబీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: