తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌డంతో మంత్ర‌వ‌ర్గంలో చోటుద‌క్క‌ని నేత‌లు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి నోరు విప్పారు. మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశార‌ని వాపోయారు. త‌న‌కు ఇస్తాన‌న్న ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి వ‌ద్ద‌ని..అందులో ర‌సం లేద‌ని ఫైర్ అయ్యారు. ఇక మ‌రో మాజీ ఉప ముఖ్య‌మంత్రి టి.రాజ‌య్య సైతం తెలంగాణ‌లో 12 శాతం మాదిగ‌లు ఉన్నారని.. కానీ కేబినెట్‌లో ఒక్క మాదిగ కూడా లేర‌ని విమ‌ర్శించారు.


ఇక ఈ లిస్టులో చాలా మంది నేత‌లే ఉన్నారు. వీరంతా ఒక్కొక్క‌రిగా త‌మ అసంతృప్తి వెళ్ల‌క‌క్కుతున్నారు.మాజీ మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌ పద్మా దేవేందర్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌‌‌‌, రెడ్యానాయక్‌‌‌‌, ఆరూరి రమేశ్‌‌‌‌‌తో పాటు పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించి భంగ‌ప‌డ్డారు. ఇక మాజీ మంత్రి జోగు రామ‌న్న మంత్రి ప‌ద‌వి రాలేద‌ని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.


ఆయ‌న ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకుని గ‌న్‌మెన్లు, డ్రైవ‌ర్ల‌ను వెన‌క్కి పంపి అండ‌ర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయారు. ఫోన్లు స్విచాప్ రావ‌డంతో కుటుంబ‌స‌భ్యులను ఆరా తీస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఆయ‌న ఇంటివ‌ద్ద ప‌రిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. జోగురామ‌న్న కేసీఆర్ గ‌త కేబినెట్‌లో ప‌నిచేశారు. బీసీ సంక్షేమం, అట‌వీ శాఖ చూశారు. మున్నూరు కాపు సామాజిక వ‌ర్గానికి ఆయ‌న‌కు బ‌దులుగా అదే వ‌ర్గానికి చెందిన క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో రామ‌న్న ఆశ‌లు అడియాస‌లు అయ్యాయి.


ఇక క‌రీంన‌గ‌ర్‌లో బండి సంజ‌య్‌ను ఎదుర్కొనేందుకు గంగుల‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. ఆదిలాబాద్‌లోనూ బీజేపీ దూసుకుపోతోంద‌ని అక్క‌డ ఆ పార్టీని ఎదుర్కొనేందుకు రామ‌న్న‌కు ఎందుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ర‌ని ఆయన అనుచ‌రులు ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాకు నాలుగు మంత్రి ప‌ద‌వులు ఎలా ఇస్తార‌న్న విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: