వరుణుడు కనికరించాడో,లేక కోపంతో కన్నెర్ర చేసాడో తెలియదు కాని తన వర్షపు ధారలతో అన్ని ప్రాజెక్ట్‌లకు కొత్తదనాన్ని తెచ్చాడు.దీంతో ఇప్పుడు నదులన్ని గలగలల సవ్వడులతో జలకళను నిండుగా సంతరించుకుని బిరబిరమని ప్రవహిస్తున్నాయి.పరవళ్లుతొక్కే ఈ ప్రవాహనికి జలాశయాల్లో నీరు పుష్కలంగా నిండటంతో నాగార్జున సాగర్‌ కుడికాలువకు 10,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ఇప్పటికే తాగునీటి చెరువులు పూర్తిగా నిండిపోయి,సాగునీటి అవసరాలకు సరిపోను నీరు మిగులు ఉండటం తో 1500 క్యూసెక్కుల నీటిని గుండ్లకమ్మ వాగులోకి విడుదల చేస్తున్నారు.ఇక శ్రీశైలం నుంచి వస్తున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతూ ఉండటంతో,కొద్దిసేపటి క్రితం నాగార్జున సాగర్‌ డ్యామ్‌ గేట్లను అధికారులు తెరిచారు.



మంగళవారం ఉదయం 2.60 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరగా,ఇక్కడ నీటిని నిల్వ చేసే వీలు లేకపోవడం తో 16 గేట్లను అయిదు అడుగుల మేరకు ఎత్తిన అధికారులు,1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.ఇక కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు 15 నాటికే నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నిండింది.జిల్లాలోని అన్నిజలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వచ్చిన వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.గత వరదముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంకగ్రామాల ప్రజలు ఇప్పుడు మళ్లీ ఆందోళన చెందుతున్నారు.



అయితే సాగర్‌గేట్లు ఎత్తగానే,లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి,సహాయక బృందాలను ముంపు ప్రాంతానికి పంపామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్దితిలో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 80 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా,నేటి సాయంత్రానికి 3 లక్షల క్యూసెక్కులను దాటే ప్రమాదం ఉండటంతో,ఉండవల్లి,కరకట్ట మరోసారి ముంపు ప్రమాదంలో చిక్కుకుంది.ఈ వరదను దృష్టిలో ఉంచుకుని,భవానీ ద్వీపానికి యాత్రికుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.మొత్తానికి వర్షాలవల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాలకు కొంతవరకు సాగునీటి బాధలను ఇలా ఐన ఆ వరుణుడు తీర్చాడని రైతులు ఆనందంగా వున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: