నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణ పరిధిలోని మద్దూరుపాడులో టీడీపీ నేత దామిశెట్టి శ్రీనివాసులు నాయుడుకు చెందిన రైస్‌మిల్లులో సోమవారం సుమారు 5.6 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడింది. బియ్యంను పౌరసరఫరాలశాఖ, పోలీస్‌ అధికారులు పరిశీలిస్తుండగానే నెంబర్ ప్లేట్ లేని మరో ఆటోలో 600 కేజీల రేషన్‌ బియ్యం మిల్లులోకి వచ్చింది. వీటిని వెంగళరావునగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి  తీసుకువచ్చారు.  దాన్ని బయటకు పంపేందుకు శ్రీనివాసులు నాయుడు సోదరుడు ప్రయత్నించగా కావలి రూరల్‌ సీఐ మురళీకృష్ణ, ఎస్సై అరుణకుమారి, ఏఎస్సై తిరుమలరెడ్డి వాటినీ పట్టుకున్నారు.

 

 

 

కావలిలో కొందరు రైస్‌మిల్లుల యజమానులు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో రేషన్‌ బియ్యాన్ని సేకరించి వాటికి పాలీష్‌ పట్టి బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై అనేక సార్లు పలు మిల్లులపై దాడులు కూడా జరిగాయి. శ్రీనివాసులునాయుడుకు చెందిన వేపకాయల మిల్లు కేంద్రంగానే రేషన్‌ బియ్యం సేకరణ జరుగుతోంది. ఇందుకోసం విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కార్డుదారులు, రేషన్‌ డీలర్ల వద్ద సేకరించిన బియ్యాన్ని ఎరువుల బస్తాల్లో వేపకాయల మిల్లు వద్దకు చేర్చినందుకు కేజీకి రూ.15 వంతున చెల్లిస్తున్నారు. మిల్లులోనే స్టాక్‌ పాయింట్‌ ను ఏర్పాటు చేసుకుని సొంత లారీలోనే మద్దూరుపాడులో ఉన్న రైస్‌మిల్లుకు తరలిస్తుస్తున్నట్లు పౌరసరఫరాల శాఖాధికారులు, పోలీసులు గుర్తించారు.

 

 

 

రేషన్‌ బియ్యాన్ని ఎవరికీ అనుమానం రాకుండా పాత యూరియా బస్తాల ద్వారా తరలిస్తున్నారు. అధికారులు వెళ్లేసరికి లారీలో కొన్ని బస్తాలు, మిల్లులో దించిన బస్తాలు, బస్తాల్లోంచి మిల్లులో పోసిన బియ్యం ఉన్నాయి. కాగా కావలి సివిల్‌ సప్లయీస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ కె.వెకంట్రామిరెడ్డి, కావలి డివిజన్‌ అసిస్టెంట్‌ సివిల్‌ సప్లయీస్‌ అధికారి ఐ.పుల్లయ్య, కోవూరు సివిల్‌ సప్లయీస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ జీఎస్‌ కృష్ణప్రసాద్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. కాగా.. శ్రీనివాసులు నాయుడు కుమారుడు మీడియాకు నోటీసులు ఇస్తానని బెదిరించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: